ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనతో తెలంగాణాలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బోర్డును ఏర్పాటు చేస్తామని మహబూబ్‌నగర్ సభలో ప్రధాని మోదీ(PM Modi Sanctioned Turmeric Board) ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలో బోర్డు ఏర్పాటు అంశం ఎన్నికల నినాదమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 178 మంది పసుపు రైతులు నామినేషన్లు(Farmers Nominations) వేశారు. బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానంటూ ఆ ఎన్నికల సందర్భంగా అప్పటి నిజామాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అర్వింద్(Dharmapuri Arvind) బాండ్ పేపర్ రాసిచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు.
నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని పార్లమెంటులో వెల్లడించింది. దీంతో హామీ నెరవేర్చలేదంటూ ఎంపీ అర్వింద్ పర్యటనలను రైతులు, బీజేపీయేతర పార్టీల వారు అడ్డుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రాధాన్యాంశంగా మారుతుందన్న అంచనాల నేపథ్యంలో బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) తాజాగా ప్రకటన చేశారు. దీన్ని ఎన్నికల హామీగా బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తుండగా.. బోర్డు ఏర్పాటు కల నెరవేరనుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో 1.53 లక్షల ఎకరాల్లో సాగు : పసుపు ప్రపంచ ఉత్పత్తిలో 80 శాతం మన దేశంలోనే జరుగుతోంది. పసుపు పంట ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశమూ భారతే. దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ద్వితియ స్థానంలో ఉంది. 2022-23లో రాష్ట్రంలో 1,53,912 ఎకరాల్లో పసుపు పంట వేయగా.. 3.40 లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అయింది. తెలంగాణలో 20,250 టన్నుల మేరకే వినియోగమవుతుండగా.. మిగిలింది ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తోంది. పసుపు సాగు(Turmeric Cultivation)లో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. అక్కడ ఏటా 65 వేల ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లోనూ విస్తారంగా సాగవుతోంది. నాణ్యమైన, భారీ డిమాండ్ ఉన్న కర్క్యూమిన్ రకం పసుపు(Curcumin Type Turmeric) రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోంది.