భారతీయ రైల్వేలో మెరుగైన సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు(Vande Bharat Trains).. దేశంలో అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు. వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. ఇప్పటివరకు ఈ రైళ్లలో 1,11,00,000 మంది ప్రయాణించారని వెల్లడించారు. ఇప్పటికే దేశంలో 25 వందే భారత్ రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా.. తాజాగా మరో తొమ్మిది రైళ్లను ప్రధాని మోదీ(Prime Minister Modi) వర్చువల్‌గా జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో నడిచే కాచిగూడ- యశ్వంత్‌పుర్, విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయి.
“భారత్లో ఒక రోజు రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య.. అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ అని ప్రధాని మోదీ తెలిపారు. “దేశంలో గత కొన్నేళ్లుగా పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి నిలిచిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. మేము అధికారంలోకి వచ్చాక రైల్వేల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. నేడు ప్రారంభించిన రైళ్లు.. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, బంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో సేవలు అందిస్తాయి” అని మోదీ వివరించారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాకే రైల్వేశాఖ నూతన శకం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధి చేపడుతున్నారు. ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను నేడు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ మీదుగా రెండు రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా మరో వందే భారత్ రైలు కాచిగూడ, బెంగళూరు ప్రారంభమైంది. మూడు రాష్ట్రాలు, 12 జిల్లాలకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు చాలా సౌకర్యవంతంగా ఈ రైలు ఉంటుంది.
వచ్చే నెల 1న మహబూబ్ నగర్, వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తెలంగాణలో కొత్త రైల్వే ప్రోజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణకు రూ.4418 కోట్ల బడ్జెట్ రైల్వే అభివృద్ది కోసం కేంద్రం కేటాయించింది. రూ.31,200 కోట్ల రైల్వే ప్రోజెక్టులు పనులు సాగుతున్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ది కూడా చేపట్టబోతున్నాం అని కామెంట్స్ చేశారు.