మంగళవారం (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఆమే కొనియాడారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుందన్నారు. అంతేకాకుండా.. మువ్వన్నెల జెండా చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి అన్నారు. భారతదేశ జీడీపీ ఏటా పెరుగుతోందని రాష్ట్రపతి వివరించారు.
దేశంలో గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారని తెలిపారు. జీ-20కి సంబంధించిన కార్యక్రమాల పట్ల పౌరులందరూ ఉత్సాహంగా ఉన్నారని ఆమె అన్నారు. “ఈ ఉత్సాహం సాధికారత భావనతో పాటు, దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధిస్తున్నందున ఇది సాధ్యమైంది” అని ముర్ము తెలిపారు. భారతదేశ అన్నదాతలు దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా తోడ్పడ్డారని పేర్కొన్నారు. దేశం రైతులకు రుణపడి ఉంటుందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగించుకున్నామని.. చంద్రయాన్-3 జాబిల్లిపై అడుగుపెట్టే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాం. 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారతదేశం ఉండాలి” స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు.