చంద్రయాన్-3 ప్రగ్యాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 8 మీటర్ల దూరం ప్రయాణించిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శుక్రవారం వెల్లడించింది. దాని పేలోడ్లు ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్- APXS, లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్- LIBS ఆన్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్లు సవ్యంగానే పనిచేస్తున్నాయని వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై కెమికల్ కంపోజిషన్, మినరలాజికల్ కంపోజిషన్‌ను అంచనా వేయడానికి APXS పేలోడ్‌లో ఉపయోగపడుతుంది. ఇక, చంద్రుడి నేల, ల్యాండింగ్ ప్రాతంలో రాళ్లలో ఉండే వివిధ మూలకాలను LIBS పేలోడ్ గుర్తిస్తుంది.
తకుముందు విక్రమ్ ల్యాండర్‌లోని ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో శుక్రవారం (ఆగస్టు 25న) విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజ్ కెమెరా.. రోవర్ జాబిల్లిపై దిగుతున్న దృశ్యాలను బంధించింది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. అనతంరం తన వెనుక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్ర వేసింది.
మరోవైపు ఇవాళ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల పర్యటనను ముగించుకొని బెంగళూరు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఇస్రో కార్యాలయానికే వెళ్లారు. చంద్రయాన్-3 ప్రాజెక్టును విజయవంతం చేసిన శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ (TTCNMCC) కార్యాలయానికి రోడ్‌షోగా వెళ్లిన ఆయనకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్, ఇతర శాస్త్రవేత్తలు స్వాగతం పలికారు. అనంతరం మోదీకి చంద్రయాన్-3 గురించి వివరాలు తెలియజేశారు. ల్యాండర్, రోవర్ ఎలా పనిచేస్తాయనే విషయాలను మోదీకి.. సోమనాథ్ వివరించారు. శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలను ప్రధాని ఆసక్తిగా విన్నారు. వారిని పలు ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 ల్యాండర్ తీసిన తొలి ఫొటోను మోదీకి బహూకరించారు సోమనాథ్.