చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసింది. అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్లను డిలీట్ చేసింది. అనంతరం, రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్ ల్యాండర్ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ఎక్స్ (ఇంతకుముందు ట్విట్టర్)లో పోస్టు చేసింది. ‘నేను నీపై నిఘా పెడతాను!’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్ చేసిన వ్యాఖ్యలను ట్వీట్లో ప్రస్తావించింది. ‘చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్‌ను ఫొటోషూట్ చేసింది.
చంద్రయాన్-2 ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC).. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న అత్యుత్తమ కెమెరా. 23/2³/23న ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్‌ను గుర్తించింది’ అని ఇస్రో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను కూడా పోస్ట్ చేసింది. అయితే పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్లను డిలీట్ చేసింది. అయితే, ఇస్రో ఎందుకు ఆ వాటిని డిలీట్ చేసిందో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు.. విక్రమ్ ల్యాండర్ లోపలి నుంచి బయటకు వచ్చి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజ్ కెమెరాలో బంధించిన రోవర్ వీడియో ఆకట్టుకుంటోంది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. అనతంరం తన వెనుక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్ర వేసింది.