ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లి భారత యువ కెరటం, గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. కీలక టై బ్రేక్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరునా (అమెరికా)ను 3.5-2.5 ఆధిక్యంతో మట్టికరిపించాడు. దీంతో ప్రపంచ నంబర్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే)తో ఫైనల్‌లో పోటీ పడనున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించడానికి ఫాబియానో కరునాతో జరిగిన సెమీఫైనల్ పోరులో మ్యాచ్‌లు డ్రా కావడంతో ఇక కీలక టైబ్రేక్‌కు దారితీసింది. దీంతో టైబ్రేక్‌లో ఫాబియానోను ప్రజ్ఞానంద ఓడించాడు. ఇక తక్కువ వయసులోనే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన మూడో ఆటగాడిగానూ ప్రజ్ఞానంద ఘనతకెక్కాడు.
ఫైనల్‌కు దూసుకెళ్లడంపై 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ఈ టోర్నీలో మాగ్నస్‌తో తలపడతానని అనుకోలేదు. మాగ్నస్‌తో ఆటడాలంటే కేవలం అది ఫైనల్‌లోనే సాధ్యం. నేను ఫైనల్‌కు చేరుకుంటానని ఊహించలేదు. ఫైనల్‌లో నాశక్తి మేర ప్రయత్నం చేస్తాను’’ అని ప్రజ్ఞానంద పేర్కొన్నాడు. ఇక ప్రజ్ఞానంద ఫైనల్‌కు అర్హత సాధించడంపై దిగ్గజ ఆటగాడు, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఫాబియానో కరునాను ఓడించి ప్రజ్ఞానంద ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఇక మాగ్నస్ కార్ల్‌సన్‌తో ఫైనల్ పోరుకు దిగనున్నాడు. వాటే పర్‌ఫామెన్స్’ అని ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశాడు.