తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ప్రధాన రహదారి సమీపంలో శ్రీ పెద్దమ్మ వారి దేవాలయం గురించి తెలియని వారు ఉండరు. వేల సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ ఈ దేవాలయం ఉన్నట్లు చెబుతున్నా ఈ మధ్య కాలంలో అయితే ఈ గుడికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ గుడి స్థల పురాణానికి వస్తే ఒకప్పుడు మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడిస్తూ యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ ఉండేవాడు. రుషి పత్నులను చెరబడుతూ ఇంద్రాదులను తరిమి కొడుతూ ఉండేవాడు. త్రిమూర్తులు కూడా అతని ధాటికి తట్టుకోలేకపోయి శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు.
మహిషుడు సామాన్యుడు కాడు నిజానికి మహా బలవంతుడు. అందులో, వరగర్వంతో విర్రవీగుతున్నా మహాశక్తి ముందు రాక్షసశక్తి చిన్నబోయి అమ్మవారు ఆ రాక్షసుడిని అంతమొందించారు. అయితే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరమనిపించి అప్పట్లో అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్దిరోజులు సేద తీరింది. అదే జూబ్లీహిల్స్‌లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానమున్న ప్రాంతమని అక్కడి వారికి నమ్మిక. నిజానికి పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ అని ఆమెకు ఆ పేరు పెట్టుకున్నట్టు చెబుతూ ఉంటారు, సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది ఈ గుడి. తనని నమ్మి వచ్చిన భక్తులని తన చెంతను చేర్చుకొని కోరిన కోరికలు తీరుస్తుంది పెద్దమ్మ తల్లి.