తెలంగాణ అస్తిత్వానికి నెలవై ఉన్న హైదరాబాద్ లోని చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం అవుతోంది.ఇందుకోసం జరుగుతున్న పనులను డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. స్వతంత్ర దినోత్సవం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా 500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట చుట్టూ 200 సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ వేడుకల్లో పాల్గొనే వీవీఐపీ, వీఐపీ, అధికారులకు పాస్లు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15న ఉదయం.. సికింద్రాబాద్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు.. సీఎం గోల్కొండ కోటకు చేరుకొని జాతీయ పతకాన్ని అవిష్కరిస్తారు. ఈ క్రమంలోనే పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఇందులో భాగంగానే కేసీఆర్కు ఘన స్వాగతం పలికేెెెందుకు దాదాపు 1,200 మంది కళాకారులను సంసిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు.. ముందస్తు కవాతు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
జాతీయ జెండా అవిష్కరణ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యే వారు సభా ప్రాంగణంలో ఎంత దూరంలో ఉన్నా.. కార్యక్రమాన్ని స్పష్టంగా వీక్షించేందుకు 14 పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గోల్కొండ కోట చుట్టూ ఉదయం 7 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటలకు వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వేడుకలకు వచ్చేవారికోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
మరోవైపు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో ఒక లక్ష వాటర్ ప్యాకెట్లు, 25,000 వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు సభా ప్రాంగణంలో.. 4 అంబులెన్సులు, గోల్కొండ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఒక గదిని సిద్ధంగా ఉంచామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 6 బెస్ట్ బైక్స్, 4 ల్యాడర్లు, 3 ఫైర్ ఇంజిన్లు ఏర్పాటు చేయనున్నామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు.మరోవైపు స్వాతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను పురస్కరించుకొని ఈనెల 14 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో 582 తెరలపై గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 14న ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు, 16 నుంచి 24 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ చిత్ర ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 15, 20 తేదీల్లో ఈ సినిమా ప్రదర్శన ఉండదని అధికారులు వివరించారు.