జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మొదట అనుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో రావాలని పోలీసులు కోరారు. విమానాశ్రయం నుంచి పోర్టు రోడ్డులోనే రావాలని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా రోడ్‌షో నిర్వహించొద్దని ఆంక్షలు విధించారు. బయటికొచ్చి అభివాదాలు కూడా చేయొద్దని సూచించారు. వారాహి యాత్రలో భాగంగాఈరోజు సాయంత్రం 5 గంటలకు నగరంలోని జగదాంబ కూడలిలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
జనసేనాని పవన్ మూడో విడత వారాహి యాత్ర నేటి నుంచి ఆగష్టు 19 వరకు జరుగనుంది. ఉత్తరాంధ్రలో 10 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. విశాఖలోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు కార్మికుల పోరాటానికి జనసేనాని మద్దతు తెలుపనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జగదాంబ జంక్షన్‌లో ఏర్పాటు చేసే సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. అనంతరం జనవాణి కార్యక్రమం, క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇక వారాహి యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. పవన్ వారాహి యాత్రకు షరతులతో కూడిన అనుమతులను పోలీసులు ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదని, ఎయిర్‌పోర్ట్ నుంచి ర్యాలీగా రావొద్దని జనసేనానికి సూచించారు. ఇక వాహనం పైనుంచి అభిమానులకు అభివాదాలు చేయవద్దని పోలీసులు షరతు పెట్టారు. జగదాంబ జంక్షన్‌లో బహిరంగ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేసినా.. కార్యకర్తలు, అభిమానులు బిల్డింగ్ లు ఎక్కకుండా చూసే బాధ్యత జనసేనదేనని, ఉల్లంఘనలు జరిగితే అనుమతి తీసుకున్నవారిపైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.