వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా భారతీయ రైతు జీవిస్తారు. వ్యవసాయం వెన్నెముకగా అవతరించిన భారత దేశంలో రైతులు ఎన్నోరకాల పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లతో పాటు ఎద్దులను తమ కుటుంబసభ్యులుగా భావించి వాటి సహాయంతో వ్యవసాయం చేస్తుంటారు. రైతంటేనే రాజు, ఆ రాజుకు నిత్యం తోడుగా నిలిచేవి నందీశ్వరులు. పొలానికి వెళ్లేటప్పుడు ఈ బసవన్నలను ఆప్యాయంగా చూస్తూ.. వ్యవసాయంలో తమకు నిత్యం తోడుగా ఉండే ఎద్దులను.. రైతులు దైవంగా భావిస్తారు. ట్రాక్టర్లు మొదలగు సౌకర్యాలు వస్తున్న రైతన్నలు మాత్రం పొలం దున్నడానికి ఎద్దులను ఉపయోగిస్తున్నారు. దసరా, దీపావళి, బతుకమ్మ కంటే ఘనంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎద్దుల కోసం ప్రత్యేకంగా ఓ పండగ జరుపుకుంటారు. దాన్నే పొలాల పండగ అంటారు. ఈ పండుగ అమావాస్య రోజున వస్తుంది. కావున ఈ పండుగను పొలాల అమావాస్య పండుగ అని అంటారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య రాకతో పొలం పనులు దాదాపుగా తగ్గుముఖం పడతాయి. ఏడాదంత కష్టపడిన బసవన్నలని.. పండగకు ఒకరోజు ముందు శుభ్రంగా కడిగి… పసుపురాసి.. శరీరంపై దుస్తులు వేసి నందీశ్వరులుగా అందంగా అలంకరిస్తారు. వాటిని గ్రామదేవతలు, హన్మాన్ ఆలయం చుట్టుతిప్పి గ్రామంలో ఓ చోటకు చేర్చి గ్రామపెద్దలతో పూజలు చేయిస్తారు. “ప్రతి పొలాల అమావాస్య రోజు ఆ భగవంతుడే సాక్ష్యాత్తు ఎద్దులను చూడటానికి వస్తాడని నమ్మకం. అందుకే మేము అమావాస్య రోజు ఎద్దులను ముస్తాబు చేసి పండుగ జరుపుకుంటాము. పొలం పనుల్లో అది సాయం చేస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులందరం కలిసి దాన్ని పూజించి నైవేద్యాలు పెట్టి పండగను చేసుకుంటాం. ఏడాది అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తాం.” అని గ్రామస్తులు తెలుపుతున్నారు.
భూతల్లినే సర్వస్వంగా భావించే రైతుల… దైనందిన జీవితంలో ఎద్దుల పాత్ర విడదీయలేనిది. వ్యవసాయంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు వచ్చినపన్పటికీ.. ఎద్దుల పాత్ర ఏమాత్రం తగ్గడంలేదు. అందుకే ఎద్దులంటే శివపార్వతుల పుత్రులైన నందీశ్వరులుగా.. భావించే సంప్రదాయం కొనసాగుతోంది. ఏడాదంతా తనతోపాటు కష్టపడే ఎద్దులను పూజించి ఆరాదించే వేడుకే.. పొలాల పండగ. ప్రతి ఏటా శ్రావణ అమావాస్య రోజున వచ్చే ఈ పొలాల పండగ కోసం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.