మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోదీ సభ(Modi Sabha)ను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభకు రైతులను భారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్‌లో జరగబోయే సభ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్న నేపథ్యంలో జన సమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీ పరంగా బహిరంగ సభతో పాటు అధికారిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ఎస్‌పీజీ (SPG)అధికారులు సభ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. రాబోయే ఎన్నికలకు మోదీ సభ కీలకమవుతుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు. ప్రధాని సభ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు( Turmeric board)ను, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం(Sammakka-Sarakka Tribal University) ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్ సమీపంలోని అమిస్తాపూర్ వద్ద ఆదివారం భాజపా ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజాగర్జన’ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో భాజపాను గెలిపించి.. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు. భారాస, కాంగ్రెస్ పార్టీలకు అవినీతి, కమీషన్లే సిద్ధాంతమని ఆయన విమర్శించారు. కుటుంబాల కోసమే ఆ పార్టీలు పనిచేస్తాయని.. వాటి నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని అన్నారు.
సామాన్య ప్రజలనే భాజపా కుటుంబంగా భావించి పాలన అందిస్తోందని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని.. ఆ కంపెనీలో ఛైర్మన్, సీఈవో నుంచి మేనేజర్ వరకు అంతా కుటుంబ సభ్యులేనని ఎద్దేవా చేశారు. సహాయ సిబ్బందిగా మాత్రం ఇతరుల్ని నియమించుకున్నారన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో పెద్దఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా నీరు మాత్రం అందడం లేదన్నారు.