తెలంగాణలో పసుపు బోర్డు (Turmeric Board)ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారులు(National Highways), రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘‘కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. పసుపుపై పరిశోధనలూ పెరిగాయి. తెలంగాణలో పసుపు రైతుల(Turmeric farmers) సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’’ అని ప్రధాని వెల్లడించారు.
తెలంగాణకు కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం(Central Tribal University) మంజూరు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘దేశంలో పండగల సీజన్ మొదలైంది. తెలంగాణలో ఇవాళ రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. కేంద్రం చేపట్టిన ఈ పనులతో ఎంతో మందికి ఉపాధికి కలుగుతుంది. తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్(Reservation for women)లు తెచ్చుకున్నాం. హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం పెరిగింది. దేశంలో నిర్మించే 5 టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.