తెలంగాణలోని ప్రతిపక్షాలకు మరొక్కసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా.. రాంగ్ లీడర్ కావాలో.. ప్రజలు ఆలోచించాలని సూచించారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ నేతృత్వంలో ఉన్నందునే తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ అధ్యక్షుడు డా. బీఎన్ రావుతో పాటు.. పలువురు వైద్యులు భారాసలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి భారాసలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ఎంబీబీఎస్ చదివేందుకు ఒకప్పుడు చైనా, రష్యా, ఉక్రెయిన్ వెళ్లే వారు. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ వచ్చింది. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనే విధంగా ఇవాళ రాష్రం ఎదిగింది. తెలంంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ప్రతీ సంక్షేమ పథకం వెనక ఒక సదుద్దేశం ఉంది. కేసీఆర్ కిట్ వల్ల ఆస్పత్రుల్లో సురక్షిత కాన్పులు పెరిగాయి. కళ్యాణ లక్ష్మితో బాల్య వివాహాలు తగ్గాయి. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనే పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలి’’ అని హరీశ్‌రావు కోరారు.