ఏపీలో కరెంట్ కొరతతో అటు ప్రజలు, ఇటు పరిశ్రమలకు తీవ్రఇబ్బంది కలుగుతోంది. విద్యుత్ కొరత అధిగమించడానికి ప్రభుత్వం పరిశ్రమలకు కరెంటు కోతలు విధిస్తోంది. భారీగా పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని భరించలేక పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. దీనికి తోడు అనధికారిక కరెంటు కోతలు మరింత కుంగదీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బయటకు విద్యుత్ కోతలని చెప్పకుండా ఎక్కడికక్కడ బ్రేక్‌డౌన్‌లు, నిర్వహణ పనుల పేరుతో కరెంటు తీసేస్తున్నారు. సమయపాలన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంటు కోతలు విధించడం వల్ల పరిశ్రమలు, మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు.. అనేక అవస్థలు పడుతున్నాయి.
రాష్ట్రంలో పలు చోట్ల సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేసి, కేవలం బల్బులు వెలిగించుకునేందుకే విద్యుత్ వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. స్థానిక ఏఈలు తమ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. ఫలానా టైమ్‌లో కేవలం లైటింగ్ కోసమే విద్యుత్ వాడుకోవాలని కొన్నిసార్లు, వినియోగాన్ని బాగా తగ్గించుకుని.. 40 శాతమే వాడుకోవాలని.. ఏ రోజుకారోజు వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు.విద్యుత్ కోతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి. రోజుకి గంటన్నర నుంచి రెండు గంటల పాటు కరెంటు కట్ చేస్తున్నారని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు. నిర్దిష్ట సమయం అంటూ లేకుండా, ముందుగా చెప్పకుండా కరెంటు తీసేయడంతో.. పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఎక్కువగా కరెంటుపైనే ఆధారపడే ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు వంటి వాటికి మరింతగా సమస్యలు ఎదురవుతున్నాయి.
విశాఖపట్నంలోని పారిశ్రామికవాడలో పరిశ్రమలకు రోజుకి గంటన్నరపాటు కరెంటు కోత విధిస్తున్నారు. ఏ సమయంలో తీసేస్తారో ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల పని అర్ధంతరంగా ఆపేయాల్సి వస్తోందని ఒక చిన్న తరహా పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా జిల్లా రణస్థలం మండలంలోని పైడి భీమవరంలోని రసాయన పరిశ్రమలకు గత రెండు వారాల నుంచి రోజుకు రెండు మూడు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లులకు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు బల్బులు వెలిగించుకోవడానికి మాత్రమే కరెంటును వినియోగించాలంటూ ఈ నెల 10వ తేదీ నుంచి రోజూ వాయిస్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఉత్పత్తి ఆపేసినా.. సిబ్బందికి జీతాలు చెల్లించడం వంటి ఖర్చులు తప్పవు. దాని వల్ల ఉత్పాదక వ్యయం పెరిగిపోయి, ఇప్పటికే నష్టాల బాటలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నాయి.