వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జనవాణి కార్యక్రమం(Janavani programme) నిర్వహిస్తున్న పవన్ మరోసారి తన సమస్య తిరగబెట్టడంతో మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి సమస్యతో బాధ పడుతున్నారు. తాజాగా జనవాణిలో పాల్గొన్న పవన్ ప్రజల నుంచి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ ను వెన్ను నొప్పి మొదలైంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నా వెన్ను నొప్పి తగ్గకపోవడంతో జనవాణి కార్యక్రమం మధ్యలోనే పవన్ కళ్యాణ్ వెళ్లిపోవాల్సి వచ్చింది. పవన్ ఆరోగ్యంపై జనసైనికులతో పాటు ఆయన అభిమానులు ఆందోళకు గురవుతున్నారు.
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గాయపడ్డారు. తన వెన్ను పూసకు గాయం కాగా, ఆ నొప్పి తరచూ తనను వేధిస్తోందని 2019లోనే జనసేనాని పవన్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుండగా వెన్ను నొప్పి తీవ్రమైందని పవన్ తెలిపారు. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, ఎన్నికల ర్యాలీలలో పాల్గొనడం సభలు నిర్వహించడంతో వెన్ను నొప్పి అధికమైందని స్వయంగా పవన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చికిత్స తీసుకున్నప్పుడు కాస్త ఉపశమనం ఉంటుండగా, పవన్ వరుస కార్యక్రమాలు, సభలలో పాల్గొంటే నొప్పి తిరగబెడుతోందని జన సైనికులు చెబుతున్నారు.
పెడనలో జరగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు వైఎస్ఆర్‌సీపీ గూండాలు, రౌడీలతో ప్రయత్నిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. రాళ్ల దాడులు చేసి రక్తపాతం సృష్టించాలని అనుకుంటున్నారని మచిలీపట్నంలో ఆరోపించారు. ఈ అంశంపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. వైసీపీ వాళ్లు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులను కోరారు. వారాహి యాత్రపైకి రాళ్లతో ఎవరైనా దాడులకు వస్తే వారిపై దాడి చేయవద్దని పట్టుకుని పోలీసులకు అప్పగించాలన్నారు.