ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో వచ్చేది జనసేన – టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Janasena leader Pawan Kalyan) పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టే 151 సీట్లున్న జగన్(CM Jagan)కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్(Janasena leader Pawan Kalyan) అన్నారు. అవినీతికి అలవాటు పడ్డ వారికి ఇదెలా అర్థమవుతుందన్నారు. సెప్టెంబరులో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పేరుతో ప్రభుత్వం సర్వే చేయించిందని.. ఈ సర్వేలో 3.17 లక్షలకు పైగా కుటుంబాలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోయాయని తేలిందన్నారు. 3 లక్షలకు పైగా పిల్లలు డ్రాపవుట్స్ ఉన్నాయన్నారు. 62,754 మందికి పైగా బడి ఈడు పిల్లలు చనిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఈ విషయం అడిగితే ప్రభుత్వం ఏదో కంటి తుడుపు సమాధానం ఇచ్చిందన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే చేయించారా లేదా అంటూ పవన్ ప్రశ్నించారు. ఈ జీఈఆర్ సర్వే(GER survey)పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పిదాలు చదువుతూ కూర్చొంటే గడ్డం నెరిసిపోతోందని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండి అంటూ ప్రజలను ఆయన కోరారు. కొందరికి ఈ పొత్తు వల్ల ఇబ్బంది పడొచ్చు.. కానీ అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. గతంలో టీడీపీ వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉండొచ్చు.. వారు ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు. స్వయంగా తాను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే తన నిబద్జత ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వాలని.. మళ్లీ జగన్‌కు ఓటేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు.
పవన్ మాట్లాడుతూ..” సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అవనిగడ్డ(Avanigadda) ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారు. ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు అండగా ఉండాలి. ఈసారి తేడా జరిగితే 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతారు. నేనేం వెనక్కు వెళ్లను.. ఇక్కడే ఉంటాను. జగనుకేం ఊరికే ఓట్లు వేయలేదు.. పదేళ్లు రోడ్ల మీద తిరిగాడు. ఇప్పుడంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ.. గతంలో రోడ్ల మీదే తిరిగాడు. 2019లో దేవుడనుకుని ఓట్లేశారు.. ఇప్పుడు దెయ్యమై పట్టుకున్నాడు. దేవుడు లేని ఊళ్లో.. మంచం కొయ్యే పోతురాజు అన్నట్టుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల తీరు. ఏపీని పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి మందే జనసేన-టీడీపీ వ్యాక్సిన్. వైసీపీ గుర్తు ఫ్యాన్.. ఎవ్వరికీ అందదు.. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలతాయి.
ఏపీ అభివృద్ధిని.. నిరుద్యోగులను వైసీపీ ఫ్యాను(YCP fan)కు ఊరేశారు. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను. రామ-రావణ యుద్దం జరుగుతున్నప్పుడు రామాయ స్వస్తి.. రావణయా స్వస్తి అనే రకం కాదు. నేను ప్రజల కోసం ఓ సైడ్ తీసుకున్నాను. నన్ను బీసీలు.. ఎస్సీలతో తిట్టిస్తారు. నా చిన్నప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చేయను. జగనుకు ఎవరు సలహాలిస్తున్నారో.. కాస్త మార్చుకోండి. నన్ను విమర్శించే వారి కులం చూడను.. మనుషుల్నే చూస్తాను.” అని అన్నారు.