పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించడానికి శనివారం అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. కాకర్ కొత్త ప్రభుత్వం ఎన్నుకోబడే వరకు ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభాల నుండి అణ్వాయుధ దేశాన్ని నడిపించడానికి మంత్రివర్గాన్ని మరియు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. నూతన ప్రధాని అన్వర్ ఉల్ హక్.. బలూచిస్థాన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
రేపు (ఆగస్ట్ 13)న తాత్కాలిక ప్రధానిగా కాకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ప్రధానితో సమావేశం అనంతరం విపక్ష నాయకుడు రియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రధాని చిన్న ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తిగా ఉండాలని నిర్ణయించుకున్నామని అన్నారు. కాకర్ పేరును ఆయనే సూచించారని, దానికి తాము ఆమోదం తెలిపామని అన్నారు. కాగా,రెండు రోజుల క్రితం పాకిస్తాన్ పార్లమెంట్ అయిన నేషనల్ అసెంబ్లీ రద్దు అయిన విషయం తెలిసిందే. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ప్రకటించారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేస్తే 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది. దీంతో నవంబర్ లో పాక్ లో ఎన్నికలు జరుగనున్నాయి.