రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వడం సినిమాల్లో మనం తరచుగా చూస్తుంటాం. ఒక్క పాటలో లేదా ఒక్క రోజులో హీరో ఎంతో కస్టపడి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. లాటరీ టికెట్ తగలడమో.. భారీగా వజ్రాలు లేదా డబ్బు సంచులు దొరకడంతో కోటీశ్వరులు అవుతుంటారు. నిజ జీవితంలో ఇది అసాధ్యం అని చెప్పాలి. అయితే చిలీకి చెందిన ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇల్లు సర్దుతుంటే చెత్తలో దొరికిన తండ్రి బ్యాంకు పాస్ బుక్ ద్వారా అతడు కోటీశ్వరుడు అయ్యే అవకాశం వచ్చింది.
చిలీకి చెందిన వ్యక్తి ఎక్సెక్వియెల్ హినోజోసా తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు అతడికి ఓ బ్యాంక్ పాస్‌బుక్ కనిపించింది. అది పనికిరాదనుకున్నాడు. అయితే దాన్ని నిశితంగా పరిశీలించగా.. అది తన తండ్రి బ్యాంక్ పాస్‌బుక్ అని, చాలాకాలం క్రితంది అని తెలిసింది. ఈ బ్యాంకు పాస్‌బుక్ సంబంధించి అన్ని వివరాలు ఎక్సిక్వియెల్ తండ్రికి మాత్రమే తెలుసు. అయితే ఎక్సెక్వియెల్ తండ్రి 10 ఏళ్ల క్రితమే మరణించాడు. దాంతో ఆ డబ్బు వివరాలు ఎవరికీ తెలియకుండా పోయాయి. ఎక్సెక్వియెల్ అదృష్టం బాగుండి అతడికి ఆ బ్యాంక్ పాస్‌బుక్ దొరికింది.
పాక్‌బుక్‌లో వివరాలు చూసిన ఎక్సెక్వియెల్ హినోజోసా.. 1960-70లో ఎక్సిక్వియెల్ తండ్రి 1.40 లక్షల చిలీ పెసోలను బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు తెలుసుకున్నాడు. ఆ డబ్బుతో ఇల్లు కొనాలనుకున్నా.. ఆ కల నెరవేరకుండానే ఎక్సెక్వియెల్ తండ్రి కాలం చేశాడు. ఆ డబ్బును ఎక్సిక్వియెల్ విత్‌డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే పాక్‌బుక్‌తో లింక్ అయిన బ్యాంక్ చాలా కాలం క్రితమే మూసివేయబడిందన్న విషయం తెలిసి చాలా నిరుత్సాహపడ్డాడు. అయితే బ్యాంక్‌లో జాప్యానికి గురైతే.. తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పాక్‌బుక్ మీద ఉంది. ఇది చూసిన ఎక్సెక్వియెల్‌కు ఉత్సాహం వచ్చింది.
పాక్‌బుక్ పట్టుకుని ప్రభుత్వ అధికారులను సంప్రదిస్తే.. ఎక్సెక్వియెల్‌కు సాయం చేయడానికి వారు నిరాకరించారు. అయినా పట్టువిడవకుండా పాక్‌బుక్‌ను ఆధారం చేసుకుని కోర్టు మెట్లు ఎక్కాడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బు తమకు చెందాలని కేసు వేశాడు. కోర్టు అన్నింటిని పరిశీలించి.. ఎక్సిక్వియెల్‌కు డబ్బు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. 1.2 మిలియన్ డాలర్లకు (సుమారు 10 కోట్ల భారతీయ రూపాయలు) సమానమైన 1 బిలియన్ చిలీ పెసోలను చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అంత మొత్తం చెల్లించలేమని సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేసు వేసింది. అత్యున్నత న్యాయస్థానం కూడా ఎక్సెక్వియెల్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే.. అతడు కోటీశ్వరుడవుతాడు.