తన తండ్రి, భర్త ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పనిచేసినా.. తమ కుటుంబం ఎప్పుడూ ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) స్పష్టం చేశారు. రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పరితపించేవారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఆమె చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ముగిసింది. రాజమహేంద్రవరంలో ఆమెకు నిమ్మరసం ఇచ్చి చిన్నారులు దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దీక్షలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
‘‘స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీజీనే జైలులో పెట్టారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించాలని చంద్రబాబును కోరేదాన్ని. ఎప్పుడూ ప్రజల బాగు కోసమే ఆయన పరితపించారు. నా ఆయుష్షు కూడా పోసుకొని చంద్రబాబు (Chandrababu) జీవించాలి. ప్రభుత్వ నిధులను మేం ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. ప్రజాధనంపై మాకు ఎప్పూడు ఆశలేదు. మా కుటుంబ సభ్యులపై ఒక్క కేసు కూడా లేదు. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి ఆయన ఎంతో కష్టపడ్డారు. చంద్రబాబుపై నమ్మకంతోనే హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. ప్రజల కోసం రోజుకు 19 గంటలు కష్టపడేవారు. రోజుకు 3 – 4 గంటలే నిద్రపోయేవారు. చంద్రబాబు పదేళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి జరిగేది. ఈసారి మీ ఓటును సరిగా వేయాలని కోరుతున్నా. చంద్రబాబు అరెస్టు చూసి మనస్తాపంతో 105 మంది మరణించారు. వీరి కుటుంబాలను త్వరలో పరామర్శిస్తా’’ అని వెల్లడించారు.