ఆశావహులను ఆసరా చేసుకొని.. వారినుండి ఎలాగైన డబ్బు కాజేయాలని దొరికిన అడ్డదారులన్ని తోక్కేస్తున్నారు కేటుగాళ్లు. తరచుగా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నా.. ప్రజల్లో మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. లక్ష రూపాయలకు వేళల్లో వడ్డీ వస్తుందని అత్యాశ చూపుతూ కొంతమంది నేరగాళ్లు ఈజీ మనీని ఎర చూపించి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అత్యాశకు వెళ్లి అనధికార యాప్ లో పెట్టుబడులు పెట్టిన బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటున్నారు. దీనిపై అధికారులు, ప్రజా సంఘాల నాయకులు అవగాహన కల్పిస్తున్నా.. కానీ మోసపోవడంలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా.. ఇలాంటి ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, భూత్పూర్ పట్టణాలో జరిగింది.
ఈజీ మని కోసం ఆశపడి వేల రూపాయలను పెట్టుబడి పెట్టారు. భూత్పూర్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త. భూత్పూర్ మండల జడ్చర్ల మండలంలోని పలు తాండాల గ్రామాల ప్రజలతో లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టించాడని తెలుస్తోంది. జనాలతో పెట్టుబడులు పెట్టించేందుకు యాప్ నిర్వాహకులు ఏకంగా వెండి పళ్లెంలో బహుమతిగా అందించినట్టు కూడా సమాచారం. ఆసుపత్రుల్లో కొనుగోలు చేసే మెటీరియల్ పై పెట్టుబడులు పెట్టాలంటూ ఓ యాప్ ను తయారు చేశారు.
అందులో పెట్టుబడి పెట్టే వ్యక్తి ఐడి నెంబర్నుకేటాయించి ఎంత డబ్బు పెట్టారు, రోజువారిగా అకౌంట్ లో ఎంత జమ చేస్తున్నారని పూర్తి అంశాలను వివరిస్తూ ఆన్ లైన్ లో పొందుపరిచారు. ఒక్కో వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టారు అనే విషయాలను యాప్ లో నిమిషానికి అప్డేట్ చేస్తుండడంతో వేల మంది ఆకర్షితులై జడ్చర్ల భూత్పూర్ మున్సిపాలిటీలతో పాటు పలు తాండాలోని ప్రజలు ఇప్పటి వరకు వేల మంది కోట్లలో పెట్టుబడులు పెట్టారు.
ఇదిలా ఉండగా ఈ యాప్ నిర్వాహకులు సైతం పెట్టుబడులు పెట్టించేలా ఆకర్షనీయ మైన స్కీములను పెట్టడంతో.. వేలాది మంది యాప్లో పెట్టుబడులు పెట్టారు. ఒక్కో రకం పెట్టుబడిపై 45 రోజుల నుంచి 52 రోజులకు లాభంతో పాటు అసలు చెల్లిస్తామంటూ ఆకర్షించే విధంగా వెల్లడించడంతో కొందరు వేల రూపాయలను మరికొందరు లక్షలను పెట్టుబడులుగా పెట్టారు. ఉదాహరణకు 18 వేల రూపాయలు పెట్టుబడి పెడితే రోజుకు 1044 రూపాయల చెల్లిస్తూ 45 రోజుల పాటు 46, 980 చెల్లిస్తామంటూ పెట్టుబడిదారులు ఆశలు చూపించారు. అలాగే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రోజుకు 6500 రూపాయలని 50 రోజుల పాటు3.25 లక్షలు,1, 50,000పెట్టుబడి పెట్టున వారికి 10, 500 చొప్పున 52 రోజులలో 5.46 లక్షలు చెల్లిస్తున్నట్లు యాప్ నిర్వాహకులు వెల్లడించడంతో వేలాదిమంది ఈ యాప్ లో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు.
ఈ యాప్లో 10,000 నుంచి 2 లక్షల వరకు సుమారు 5,000 మంది దాదాపు 10 నుంచి 15 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టుగా తెలిసింది. చివరకు యాప్ నిర్వాహకులు ఉన్నట్టుండి బోర్డ్ తిప్పేశారు. యాప్ పని చేయడం లేదు.డబ్బులు మోసపోయామని బాధితులంతా గుర్తించారు. ఇటీవల పెట్టుబడి పెట్టిన వారు తమ డబ్బులు తీసుకునే అంశంలో జడ్చర్ల లోని ఓ ఫంక్షన్ హాల్ లో అంతర్గత సమావేశం సైతం నిర్వహించుకున్నారని సమాచారం. పెట్టుబడులు పెట్టిన వారంతా సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసుకొని తమ బాధను గోడును వెల్లబోసుకుంటున్నారు.
యాప్ లో పెట్టుబడులు పెట్టించిన సదరు అధికార పార్టీ కౌన్సిలర్ భర్త సైతం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టానని తనకు లక్షల్లో రావాల్సి ఉందని నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలంటూ మాట దాటేస్తున్నారు. పెట్టుబడి పెట్టిన వారంతా అధికంగా గిరిజనులు, గ్రామాలలో నిరుపేదలు ఉన్నారు. ఈ అంశంపై ఇటీవల పోలీసులు సైతం విచారణ చేపట్టినట్టు యాప్లు ఫేక్ అని గుర్తించినట్టు తెలిసింది. అధికారికంగా ఎవరు కూడా ఈ మోసంపై పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదులు చేయలేదు.