పూర్తిగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఎడ్-టెక్ స్టార్టప్ బైజూ’స్ లో పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రత్యూష అగర్వాల్ రాజీనామా చేశారు. కాగా, బైజూ’స్‌లో గతేడాది ఫిబ్రవరిలో ప్రత్యూష అగర్వాల్ చేరారు. అంతకుముందు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఆమె పని చేశారు. ప్రత్యూషతోపాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడారు. ఈ సంగతి బైజూ’స్ అధికార ప్రతినిధి మంగళవారం ధ్రువీకరించారు. కంపెనీలో రెండు విభాగాలకు బిజినెస్ హెడ్‌లుగా వ్యవహరిస్తున్న హిమాన్షు బజాజ్, ముకుత్ దీపక్ కూడా సంస్థను వీడారని తెలిపారు.
కరోనా మహమ్మారి వేళ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో పైపైకి దూసుకెళ్లిన బైజూ’స్‌కు తర్వాత ఆదరణ తగ్గింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు క్రమంగా గిరాకీ తగ్గడంతో ఆర్థిక, నిర్వహణ సమస్యలతో సతమతం అవుతున్న బైజూ’స్‌లో కంపెనీ బిజినెస్, ఆపరేషన్ విభాగాల్లో యాజమాన్యం పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. నాలుగు విభాగాలను కే-10, ఎగ్జామ్ ప్రిపరేషన్ అనే విభాగాలు మార్చేసింది. న్యాయపరమైన చిక్కులనూ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుండటంతో ఏడాది కాలంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించింది.
ఇక రెండు నెలల క్రితం బైజూ’స్ ఫౌండర్ బైజూ రవీంద్రన్‌తో కొన్ని అంశాల్లో విభేదాలు తలెత్తడంతో జీవీ రవిశంకర్, వివియాన్ వూ, రషెల్‌డ్రెసెన్ స్టాక్ వంటి డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలిగారు. మే5న బ్రాండ్ అండ్ క్రియేటివ్ స్ట్రాటర్జీ సీనియర్ డైరెక్టర్ ఆదిత్యన్ కయాలకల్ రాజీనామా చేయగా, రిజు రవీంద్రన్, బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్ నాథ్ కూడా బోర్డు నుంచి బయటకు వచ్చారు. బైజూ రవీంద్రన్ భార్య దివ్యా గోకుల్ నాథ్ కూడా బయటకు రావడం ఇబ్బందికరంగా మారింది. ఇన్వెస్టర్లతో లావాదేవీలపై బైజూ రవీంద్రన్, బోర్డు సభ్యుల మధ్య గతేడాది నుంచి విభేదాలు పెరిగాయి. బోర్డు డైరెక్టర్లు, ఇన్వెస్టర్ల సూచనలు వినడానికి కూడా బైజూ రవీంద్రన్ సిద్ధంగా లేరని విమర్శలు ఉన్నాయి. ఏడాది కాలంగా ఆర్థిక ఫలితాలు వెల్లడించకపోవడంతో సంస్థ అడిటర్ గా ఉన్న డెల్లాయిట్ వైదొలిగింది.