Onion Prices: ప్రభుత్వ గణాంకాల ప్రకారం అక్టోబర్ నుంచే ఉల్లి ధరలు పెరగడం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ 1న కిలో ఉల్లి ధర రూ.38గా ఉంది. అక్టోబర్ 30 నాటికి రూ.78కి చేరింది. అతివృష్టి కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో మార్కెట్‌లో స్టాక్ కొరత కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఉల్లి ధరలు రోజురోజుకు పెరిగిపోతుండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర తగ్గించాలని కొనుగోలుదారులు కోరుతున్నారు.
కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లో టమాటా ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా కిలో టమాట ధర 200 రూపాయల వరకు అమ్మారు. ఆ తర్వాత ధరలు తగ్గాయి. టమాట రేట్లు పెరగడంతో చాలామంది వాటిని కొనడం తగ్గించేశారు. దీంతో రేట్లు కూడా తగ్గాయి. అప్పట్లో టమాట రేట్లు పెరిగినప్పుడు చాలామంది వాటిని కొనకుండా ఇతర కూరగాయాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగిస్తే ఉల్లి ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కొంచెం కష్టమైన పనే అని చెప్పాలి.
తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర, ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ధర పలకని కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు ఉల్లి సాగు తగ్గించగా.. ఈ సంవత్సరం భారీ వర్షాలు, వరదల కారణంగా చాలాచోట్లా ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లి దిగుబడి చాలావరకు తగ్గింది. అవసరాలకు తగినంత పంట మార్కెట్ లో అందుబాటులో లేకుండాపోయింది. ఫలితంగా మార్కెట్ లో వ్యాపారులు అమాంతం రేటు పెంచేశారు. హోల్ సేల్ మార్కెట్ లోనే రూ.40 నుంచి రూ.45 మధ్య విక్రయిస్తున్నారని చెబుతూ.. రిటైల్ గా రూ.50కి పైగా అమ్ముతున్నారు. కాగా దిగుబడి సరిగా లేదన్న విషయాన్ని సాకుగా చూపుతూ వ్యాపారులు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.