గతకొన్ని రోజులుగా ప్రముఖ పుణ్యక్షేతం తిరుమలలో వన్యమృగాల సంచారంతో శ్రీవారి భక్తులు బయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలో ఆపరేషన్ చిరుత కార్యక్రమం చేపట్టారు. అధికారులు పర్యవేక్షణ నడుమ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించారు. సుమారు 100 మంది సిబ్బందితో అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగించారు. అయితే ట్రాప్ నుంచి చిరుత, ఎలుగుబంటి త్రుటిలో తప్పించుకున్నాయి. చిరుత బోన్‌కు సమీపంలోనికి వచ్చి వెనక్కి వెళ్లింది. మరోవైపు ఎలుగుబంటికి మత్తు ఇచ్చి ట్రాప్ చేసేందుకు సిబ్బంది యత్నించగా తప్పించుకుని పారిపోయింది. చిరుత, ఎలుగుబంటిని ట్రాప్ చేస్తే నడక మార్గంలో వన్య మృగాల నుంచి ప్రమాదం తప్పినట్లేనని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
శ్రీవారి అలిపిరి మెట్ల మార్గంలో వన్యమృగాల సంచారం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 22వ తేదీన కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపై చిరుత దాడి చేసి గాయపరచిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 11వ తేదీన బాలికపై చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన టిటిడి అధికారులను, యావత్తూ శ్రీవారి భక్తులను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఈ రెండు ఘటనల తరువాత నడకమార్గాల్లో భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ తీవ్ర ఆంక్షలు విధించింది. నడక మార్గాల్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య తగ్గింది. అలిపిరి నడక మార్గాల్లో చిన్నారులపై చిరుత పులి చేసిన దాడి ఘటనను శ్రీవారి భక్తులు మరిచి పోలేక పోతున్నారు. భక్తుల భధ్రత దృష్ట్యా టీటీడీ, ఓవైపు అటవీ శాఖా అధికారులు అనేక నిర్ణయాలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతూ వస్తోంది. ఆపరేషన్ చిరుతలో భాగంగా ఇప్పటికే బాలిక ఘటన తరువాత రెండు చిరుతలు బోనులో చిక్కాయి. నడకమార్గంలో సంచరించే చిరుతలు పట్టుకునేందుకు అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేశారు.