లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. అవి- ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. ఈ నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభ(Lok Sabha)కు ఇప్పుడు జమిలి ఎన్నికలు నిర్వహించగలమా? అలా చేయాలనుకుంటే, రాజ్యాంగపరంగా భారీ కసరత్తు అవసరమవుతుంది. నిబంధనల్ని సవరించాల్సి ఉంటుంది. 2024 జూన్‌కు ముందు ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీల గడువును పొడిగించాలి. ఎన్నికల్ని వాయిదా వేయాల్సిన ఈ అసెంబ్లీల గడువు ముగిశాక ఆపద్ధర్మ ప్రభుత్వాల్ని నడపడానికి రాజ్యాంగం పరిధిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
మిగిలిన అన్ని రాష్ట్రాల అసెంబ్లీలనూ ఒకేసారి రద్దు చేసి లోక్‌సభ(Lok Sabha) తో పాటు ఎన్నికలకు సిద్ధం చేయడం అంతకంటే ముఖ్యమైన సమస్య. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే తప్ప ఇష్టానుసారం అసెంబ్లీలను రద్దు చేసే అధికారం యూనియన్ ప్రభుత్వానికి(Union Govt) లేదు. ఒకవేళ జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలకు అవసరమైన మద్దతు లభించినా, చాలా రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు మొదలవుతాయి. ఎన్‌డీఏ కూటమికి చెందని పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల పదవీ కాలంపై వేటు వేస్తే పెద్దఎత్తున ప్రతిఘటన వస్తుంది. బంగాల్, తమిళనాడు, బిహార్, కర్ణాటక, కేరళ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కల్లోలం ఏర్పడుతుంది.
వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వ నమూనాను అనుసరించే ఫెడరల్ దేశం మనది. మన రాజ్యాంగం, రాజకీయాల ప్రకారం యూనియన్, రాష్ట్రాల స్థాయిలో జమిలి ఎన్నికలు దాదాపు అసాధ్యం. మరీ ముఖ్యంగా పార్లమెంటరీ తరహా కార్యనిర్వాహక వ్యవస్థతో వెస్ట్ మినిస్టర్ నమూనా ప్రభుత్వం మనకు ఉన్నంత వరకు లోక్‌సభ లేదా ఒక రాష్ట్ర అసెంబ్లీ నిర్ణీత గడువు పాటు అయిదేళ్లూ సుస్థిరంగా కొనసాగుతుందని హామీ ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎన్నికైన చట్టసభల్ని కాలవ్యవధి కంటే ముందే రద్దు చేయాల్సి రావడం, తిరిగి ఎన్నికల్ని నిర్వహించడం ఎప్పుడైనా జరగవచ్చు. అలాంటప్పుడు గతంలో జరిగినట్లే రాబోయే కాలంలోనూ అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు మళ్ళీ వేరయ్యే అవకాశముంది. జమిలి ఎన్నికల వల్ల మన ప్రజాస్వామ్యానికి ఏమైనా ప్రయోజనముందా? అనేది అసలు సమస్యగా మారింది.