ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారం ఎంతో అవసరం. కానీ, మారుతున్న జీవనశైలి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే ఆరోగ్యం, శరీరాకృతి మీద అన్ని వయసులవారికీ ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యలకు ఏ ఆహారం తగినది, బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలి, దాన్ని అదుపులో ఉంచడానికి ఏం తినాలీ…ఇలా దిశా నిర్దేశం చేసే వారే డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పట్ల ప్రజలకు శ్రద్ధ పెరగడంతో ఫిట్‌నెస్, మెడికల్ రంగాల్లో వీరి అవసరం నెలకొంది. ఆసక్తి ఉంటే మీరూ ఈ పోషకాహార నిపుణులు కావచ్చు. అదెలాగో చూద్దాం!
ప్రవేశం ఎలా:
ఇంటర్మీడియట్‌లో బయాలజీ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల డిగ్రీలో భాగంగా న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సులు చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉంటే రెండేళ్ల ఎమ్మెస్సీలో చేరవచ్చు. కొన్ని సంస్థలు ఏడాది వ్యవధితో డిగ్రీ అర్హతతో పీజీ డిప్లొమా కోర్సులనూ అందిస్తున్నాయి. పీజీ అర్హతతో న్యూట్రిషనిస్టుగా రాణించవచ్చు. డైటీషియన్ కావాలనుకుంటే కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల ఇంటర్న్‌షిప్‌తోపాటు, ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్ నిర్వహించే రిజిస్టర్డ్ డైటీషియన్ పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధించినవారికి డైటీషియన్ హోదా దక్కుతుంది.
కెరీర్ మార్గాలు
మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సెంటర్లు, కార్పొరేట్ వ్యాయామ శాలలు, వెల్‌నెస్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు, హోటళ్లు, పాఠశాలలు, కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు, ఆహార తయారీ కేంద్రాలు/ పరిశ్రమలు, అంతర్జాతీయ ఏజెన్సీల్లో న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లకు ఉద్యోగాలుంటాయి. భారత్‌లోనే కాక ఇతర దేశాల్లోనూ వీరికి గణనీయమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు ప్రత్యేకంగా వీరిని నియమించుకుంటున్నారు .
డైటీషియన్లు ఆహార తయారీ కేంద్రాల్లోనూ సేవలు అందించవచ్చు. వీరు ఆహార పదార్థాల నాణ్యత, పోషక విలువల గురించి అక్కడ పరిశోధనలు నిర్వర్తిస్తారు. అలాగే పాఠశాలలు, కాలేజీల్లో న్యూట్రిషన్/పోషణ సబ్జెక్టు గురించి అవగాహన కల్పించేలా హోమ్ సైన్స్ టీచర్‌గా, లెక్చరర్‌గా తరగతులు చెప్పవచ్చు. న్యూట్రిషన్ స్పెషలిస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజర్, వ్యక్తిగత డైటీషియన్, ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సైంటిస్టులుగా రాణించొచ్చు లేదంటే సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.