దివంగత నేత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణెం విడుదల చేశారు. నిన్న ఈ అపురూప నాణేల ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. ఈ నాణెం ఒక్కొక్కటి గరిష్ఠంగా రూ.4 వేల పైచిలుకు ధరకు మింట్ కాంపౌండ్లలో విక్రయిస్తున్నారు. అయితే, ఈ నాణేలు అందుబాటులోకి వచ్చిన తొలిరోజే భారీ డిమాండ్ నెలకొంది. ఎన్టీఆర్ బొమ్మతో ఉన్న నాణేలను తొలి విడతలో 12 వేలు ముద్రించినట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేల కోసం క్యూ లైన్లలో నిలబడి ఎన్టీఆర్ వంద నాణెం కొనుగోలు చేస్తున్నారు. గంటల తరబడి లైన్లో నిలబడి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాణెం కొనుగోలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేన్ని మూడు ధరల్లో మింట్ అధికారులు నిర్ణయించి అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ.4,050గా ధరలను నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్‌తో ఆ నాణాన్ని అమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో క్యూ కట్టారు. కాగా గతంలో అనేక రకాల నాణేలు తయారు చేసినప్పటికీ ఓ వ్యక్తిగా గుర్తుగా నాణంని రాష్ట్రపతి రిలీక్ చేయడం.. ఎన్టీఆర్ దే కావడం ఇక్కడ గమనార్హం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలామంది ఈ నాణాన్ని కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహనీయుడి పేరిట విడుదల చేసిన నాణేలకు ఈ స్థాయిలో స్పందన ఉండడంతో, కేంద్ర ప్రభుత్వం మలి విడత నాణేల ముద్రణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.