తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగల సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్రంలో 17 వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్ వ్యవస్థే కారణమని కేంద్ర నిఘా వర్గాల నుంచి తనకు సమాచారం ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు… గ్రామంలో ఎవరు ఎవరి మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, అందులో అమ్మాయిలు ఎంతమంది, వారికి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, వితంతువులు ఎంతమంది, మగవాళ్లకు ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తారని, వాలంటీర్ల ద్వారా ఆ వివరాలు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళుతున్నట్టు కేంద్ర నిఘా పెద్దలు తనకు చెప్పారని పవన్ వివరించారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. వాక్ స్వాతంత్ర్యం ఉన్నది అభిప్రాయాలు చెప్పడానికి, భిన్నాభిప్రాయాలతో చర్చాకార్యక్రమాలతో వాదించడానికి అని స్పష్టం చేశారు. కానీ నిరాధార (జీరో ఎవిడెన్స్) ఆరోపణలు చేయడానికి కాదని పవన్ కు హితవు పలికారు. రెండు లక్షల పుస్తకాలు చదివిన పవన్ కల్యాణ్ కు ఇది తెలియకపోవడం అతడి చదువులేనితనాన్ని నిరూపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఏలూరు సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వీడియోను కూడా వర్మ పంచుకున్నారు.
ఇక మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ వ్యాఖలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సైకో ఫ్యాన్స్ తప్ప పవన్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో చెప్పకుండా.. కేవలం ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎప్పుడూ చెప్పులు చూపిస్తున్న పవన్ తన వైఖరి మార్చుకోకపోతే.. జనం చెప్పులతో తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వారాహి సభలో పవన్ చెప్పిన లెక్కలు కాగ్‌వి కాదని, చంద్రబాబు ఇచ్చిన కాగితాలతో చెప్పిన కాకిలెక్కలని వ్యాఖ్యానించారు. ఎన్సీఆర్బీ నివేదికను కూడా స్పష్టంగా చెప్పలేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు.
వాసిరెడ్డి పద్మ సైతం పవన్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని.. డైలాగ్స్ కొట్టి వెళ్లడం పవన్ కు అలవాటుగా మారిందని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. రాజీకీయం కోసం పవన్ దిగజారుతున్నారని.. మిస్సింగ్ కేసులపై ఏ అధికారి పవన్ కు చెప్పారో బయట పెట్టాలని ఆమె అన్నారు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారాలు చేసిన పవన్ కళ్యాణ్ కి నోటీసులు పంపిస్తామని.. వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని వాసి రెడ్డి పద్మ డిమాండ్ చేస్తున్నారు.