ఒకర్నొకరు ఇష్టపడి శరీర వాంఛలు తీర్చుకున్నాక ఎవరిదారిన వారు విడిపోతున్నారు నేటి తరం. కొందరు మోసపూరితంగానే లొంగదీసుకోవాలని అదునుపట్టి చూస్తున్నారు. ఎలాగోలా తమ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నారు. మరికొందరు పెళ్లికి ముందే రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేస్తూ.. తీరా అన్ని అయిపోయాక ఎవరి దారిన వారు వెళ్తున్నారు. ఇలాంటి టైములో గొడవలు తళిత్తితే ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నో పథకాలు రచిస్తున్నారు. ఇందుకోసం హత్యలు కూడా చేయడం గమనార్హం. తాజాగా ఇలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
దేశంలో వివాహేతర సంబంధాలు.. దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా దిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. కొన్నేళ్లపాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి.. తనను పెళ్లి చేసుకోలేదని కోపంతో అతడి కుమారుడిని హత్య చేసింది ఓ మహిళ. అతడి ఇంటికి వెళ్లి మరీ గొంతు నులిపి చంపేసింది. ఆ తర్వాత తప్పించుకుని తిరగ్గా.. పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రపురి ప్రాంతానికి చెందిన నిందితురాలు పూజా కుమారికి 2019లో జితేందర్ అనే వివాహితుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకుంటానని పూజను నమ్మించి ఆమెతో జితేంద్ర సహజీవనం కొనసాగించాడు. అయితే 2022లో పూజను విడిచిపెట్టి.. తన భార్యాకుమారుల దగ్గరకు వెళ్లిపోయాడు జితేంద్ర. దీంతో అతడిపై పూజ కోపం పెంచుకుంది. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. జితేంద్ర.. తన కుమారుడు దివ్యాంశ్(11) కారణంగానే తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని పూజ భావించింది. అందుకే చిన్నారిని చంపేందుకు పథకం రచించింది.
ఆగస్టు 10వ తేదీన.. ఒక కామెన్ ఫ్రెండ్ ద్వారా జితేంద్ర ఇంటి చిరునామా తెలుసుకుంది. నేరుగా అతడి ఇంటికి వెళ్లగా.. తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ సమయంలో దివ్యాంశ్ నిద్రపోతున్నాడు. ఇంట్లో మరెవరూ లేకపోవడం వల్ల ఇదే అదనుగా భావించిన పూజ.. బాబును గొంతు నులిమి చంపేసింది. అనంతరం అక్కడే ఉన్న దుస్తుల్లో చుట్టి బెడ్‌బాక్స్‌లో పెట్టి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన జితేందర్ కుమారుడి మృతదేహం చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. చిన్నారిని హత్య చేసేంది పూజనేనని పోలీసులు భావించారు. అదే సమయంలో సీసీ కెమెరాల ఆధారంగా ఆ ఇంటి నుంచి ఓ మహిళ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఇంద్రపురితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాక ఆమెను జితేందర్ ప్రియురాలు పూజగా నిర్ధరించి అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం పూజ తన నేరాన్ని అంగీకరించింది.