ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాల నిలయంగా పేరొందింది హిమాచల్ ప్రదేశ్. అక్కడి ప్రకృతి పర్యాటకులకు ఉన్న బంధం విడదీయలేనిది. అటువంటి సహజసిద్దమైన అందాలు నిత్యం పర్యటకులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో ఒకటి పాలంపూర్. ఈ ప్రాంతం మన జర్నీ మొత్తాన్ని ఇక్కడే ఉండేలా కట్టిపడేస్తుంది. మరి ఆ అందాలేంటో చూద్దాం రండి..
ఇది హిమాచల్‌లోని కాంగ్రా వ్యాలీ. ఇక్కడి అహౌల్దార్ సర్వ్యూట్లోని ఒక అందమైన ప్రదేశం పాలంపూర్. స్థానిక భాషలో నీటి వసతి సమృద్దిగా వున్న ప్రదేశాన్ని ‘పాలం’ అని అంటారు. పూర్వం యీ ప్రాంతం ‘ జలంధర ‘ రాజ్యంలో వుండేది. పాలంపూర్‌కి దగ్గరౌతున్న కొద్దీ పెద్ద పెద్ద పైను వృక్షాలు, కొండవాలులలో పెరుగుతున్న ‘తేయాకు తోటలు’, ఓ వైపు ఆకాశాన్ని అంటుకుంటున్నట్లున్న మంచుతో కప్పబడిన పర్వతాలు , గలగల ప్రవహిస్తున్న జలపాతాలు, మరో వైపు పచ్చిక మైదానాలు కనువిందు చేస్తాయి. కాంగ్రా వ్యాలీలో నడపబడుచున్న టారుట్రైన్ ద్వారా పాలంపూర్‌లోని చాలా ప్రదేశాలను వీక్షింవచ్చు.
పాలంపూర్ గురించి చెప్పుకోవాలంటే.. కాంగ్రా పట్టణానికి సుమారు 35 కిలోమీటర్లు దదూరంలోని ఓ చిన్న పట్టణం. మిలిటరీ కంటోన్మెంటు వున్న ప్రదేశం . సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే ఉత్తర భారత దేశపు ‘ డార్జిలింగ్ ‘ అంటే సరిపోతుంది. ఇక్కడ ఉండే తేయాకు దేశంలోనే అతి మేలైన రకంగా గుర్తించారు. 1849 లో మొదటి సారిగా ‘ఆల్మోరా’ నుంచి తేయాకును తెచ్చి ఈ ప్రాంతంలో వేసేరు. అప్పటి నుంచి యిక్కడ ప్రముఖ పంటగా తేయాకు సంతరించుకుంది.పాలంపూర్ ప్రముఖ పర్యాటక స్థలంగా రూపొందిన తరువాత కేబుల్ కారు, ఎంమ్యూజ్ మెంట్ పార్కులు ఏర్పాటు చేసారు. ఈ ప్రదేశం పారాగ్లైడింగ్ కి ప్రముఖ విద్యాకేంద్రం కూడా. ఇక్కడ పారా గ్లైడింగ్ పోటీలు కూడా జరుగుతాయి. పాలంపూర్ నగర శివార్ల లో ‘ నౌగల్ ‘ సెలయేరు యెత్తైన పర్వతాల మీదుగా జారుతూ కనువిందు చేస్తుంది . అక్కడకి ఓ వంద మీటర్ల దూరంలో వున్న ‘ బుంద్లా ‘ జలపాతం , దానికి ఆనుకొని కట్టిన , ‘ కేప్టెన్ సౌరబ్ సింగ్ కాలియా ‘ పేరు మీద నిర్మించిన ‘ సౌరబ్ వన్ విహార్ ‘ ని సందర్శించొచ్చు.
పాలంపూర్‌కు కూతవేటు దూరంలో హిమచల్ హెరిటేజ్ విలేజ్ ఉంది. చాలామంది పర్యాటకులు అక్కడే విడిది చేసేందుకు ఇష్టపడతారు. హిమాచల్‌లో ఉండే ప్రజల జీవన విధానాన్ని దగ్గర నుంచి చూడాలనుకునేవారికి ఈ ప్రదేశం అనువైనది. అందుకనే ఆ గ్రామాన్ని ఎంచుకుంటారు. అక్కడ రోడ్డు ప్రయాణం చేసే సమయంలో దూరంగా కనిపించే ఇళ్లను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అక్కడికి దగ్గరలోనే పురాతన రాతి నిర్మిత బేజనాథ్ మందిరం ఉంది. ఆ ఆలయ నిర్మాణశైలి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దాంతోపాటు పారాగ్లేడింగ్, బీడ్ బిల్లింగ్, కాంగ్రావ్యాలీ ప్రాంతాలను ఒక్కొక్కటిగా టారుట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడొచ్చు.హిమాలయాల నుంచి వీచే స్వచ్ఛమైన గాలి, నీలి ఆకాశం, ఆకుపచ్చని, పసుపు రంగులతో అలంకరించినట్లు కనిపించే అడవులు, తోటలు, మూన్‌లైట్ శాలువ చుట్టినట్లు పర్వతాలు, పర్వతాల మధ్యలో ఉండే రహదార్లు, అందరూ బాగుండాలని వినిపించే ప్రార్థనలు, రోడ్డు మధ్యలో మేకలు, గొర్రెలు.. వాటిని వెంబడిస్తున్న కాపలాదారులు.. కోయిల కుహు కుహులు ఇలా ఒక్కొక్కటిగా చెప్పే కంటే, పచ్చని ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అనిపిస్తుంది.