ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరకుండానే.. సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు నిర్ణయించడంపై విద్యుత్ ఉద్యోగులు నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నారు. ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందంపై ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ కమిటీ నివేదికలో ప్రస్తావించిన అంశాలనే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయించినా సమ్మె ఎందుకు విరమించారని నేతలను ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ స్కేల్‌ను రూ.1.99 లక్షలకు పరిమితం చేసి.. స్టాగ్నేటెడ్ ఇంక్రిమెంట్లతో కలిపి రూ.2.60 లక్షలుగా ప్రకటించడం వల్ల ప్రయోజనం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందాల వల్ల భవిష్యత్తులో ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు. ‘పీఆర్‌సీ స్ట్రగుల్ కమిటీ’ పేరుతో కొత్తగా ఏర్పాటైన కమిటీ పోరాటాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
బుధవారం రాత్రి వరకు జరిగిన సమ్మె చర్చల నుంచి అర్ధంతరంగా వైదొలగిన విద్యుత్ ఇంజినీర్ల సంఘం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పింది. ఆ సంఘం గురువారం నుంచి విధులకు హాజరుకావాలని సభ్యులకు సమాచారం పంపడంతో వారంతా యథావిధిగా హాజరయ్యారు. చర్చల్లో కీలకంగా వ్యవహరించిన ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం (1104) ఏలూరు డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మురళీమోహన్ తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా సమ్మె విరమించడం వల్ల భావితరాల ఉద్యోగులకు అన్యాయం చేసినట్లుగా భావిస్తున్నట్లు రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు.
సమ్మె వల్ల ఆర్థికంగా ప్రయోజనం లేకపోగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. బుధవారం రాత్రి సమ్మె విరమిస్తూ ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఉద్యోగులు వాట్సప్ గ్రూపుల్లో వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే వాట్సప్ గ్రూపుల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె కార్యాచరణకు కొన్ని సంఘాలు సిబ్బంది నుంచి కనీసం రూ.2 వేలు చందా వసూలు చేశాయి. ‘ఎలాగూ సమ్మె జరగలేదు. మా డబ్బులు వెనక్కివ్వండి’ అంటూ నేతలను ఉద్దేశించి కొందరు సిబ్బంది వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. 2023 ఆగస్టు 9న పీఆర్‌సీ మరణిందన్న అర్థం వచ్చేలా ఫొటోకు పూలదండ వేసి.. కాలనీ గ్రౌండ్‌లో గురువారం పెద్దకర్మ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ లంచ్ బాక్సుతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ మరో వ్యంగ్య పోస్టు పెట్టారు.