గత వారం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, ఆగస్టు ఆఖరి వారంలో కొన్ని ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంతేకాదు, ఓటీటీలోనూ దుమ్మురేపే చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. అవి ఏంటో ఇప్పుడు చూసేయండి..
గాండీవధారి అర్జున
వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య కథానాయిక. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాత. వరుణ్‌తేజ్ ఇందులో సెక్యురిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. తనని నమ్ముకున్న వాళ్లకి రక్షణగా నిలుస్తూ ప్రాణాల్ని కాపాడటం కోసం ఓ సెక్యూరిటీ ఆఫీసర్ ఏం చేశాడు? ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే వాటిని అతనెలా ఎదుర్కొన్నాడు? ప్రాణాల్ని పరిరక్షించడంలో అతను ఎలాంటి వ్యూహాలు పన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కింగ్ ఆఫ్ కొత్త
కొత్తదనంతో నిండిన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఆయన మరో భిన్నమైన కథతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. ఆయన చిన్ననాటి మిత్రుడైన అభిలాష్ జోషిలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 24న మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
బెదురు లంక 2012
కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్, అజయ్ ఘోష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది. దీంట్లో మనసుకు నచ్చినట్లుగా జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. సమాజానికి నచ్చినట్లు బతకడం సమంజసమా.. మనసుకు నచ్చినట్లు బతకడం సమంజసమా? అన్నది సినిమాలో చూడాలి’ అని చిత్ర బృందం తెలిపింది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
బ్రో (తెలుగు సినిమా) ఆగస్టు 25
రగ్నరోక్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 24
కిల్లర్ బుక్ క్లబ్ (హాలీవుడ్) ఆగస్టు 25
లిఫ్ట్ (హాలీవుడ్) ఆగస్టు 25
డిస్నీ+హాట్‌స్టార్
ఆఖ్రి సోచ్ (హిందీ సిరీస్) ఆగస్టు 25
బుక్ మై షో
సమ్‌వేర్ ఇన్ క్వీన్స్ (హాలీవుడ్) ఆగస్టు 21
ఆహా
బేబీ మూవీ (తెలుగు) ఆగస్టు 25