టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి తప్పుకున్నాక భారత జట్టు పరిస్థితి.. మ్యూజికల్ ఛైయిర్స్‌లా తయారైంది. ఒక్కో సిరీస్‌కి ఒక్కో ప్లేయర్ కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నాడు. నవంబర్ 2021 నుంచి ఇప్పటి దాకా టీమ్‌కి 9 మంది కెప్టెన్లు మారారు. త్వరలో హెడ్ కోచ్‌ల సంఖ్య కూడా పెరునుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెస్ట్ తీసుకునే సమయంలో తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటనలో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌కి సితాంశు కోటక్, హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
సౌరాష్ట్రకి చెందిన సితాంశు కోటక్.. ప్రస్తుతం భారత A జట్టుకి హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఐర్లాండ్ టూర్‌లో టీమిండియాకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వెళ్తాడని వార్తలు వొచ్చాయి.. కానీ, లక్ష్మణ్ మాత్రం ఎన్‌సీఏలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడట. ఆసియా కప్ 2023 టోర్నీ వారం రోజుల ముందు బెంగళూరులోని ఎన్‌సీఏలో భారత జట్టు, బీసీసీఐ నిర్వహించే క్యాంపులో పాల్గొంటుంది. ఈ క్యాంపులో రాహుల్ ద్రావిడ్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా ఆటగాళ్లకు ట్రైయినింగ్‌ని పరిశీలించనున్నారు.
విండీస్ టూర్ రేపటితో ముగియనుంది. రేపు ఐదో టీ20 మ్యాచ్‌తో టీమిండియా పర్యటన ముగుస్తుంది. ఇక, రేపు ఐర్లాండ్ టూర్‌కి వెళ్లే.. భారత జట్టు, ఆగస్టు 18న తొలి టీ20, ఆగస్టు 20న రెండో టీ20, ఆగస్టు 23న మూడో టీ20 మ్యాచ్‌లు ఆడి స్వదేశానికి తిరిగి వొస్తుంది. ఇక, బెంగళూరులో ఎన్‌సీఏ క్యాంపులో పాల్గొని, ఆగస్టు 29న శ్రీలంకకు బయలుదేరుతుంది. ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత తిరిగి భారత్ కు వచ్చి.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇక, ఇదే టైంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మరో భారత పురుషుల జట్టు, ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్తుంది. ఈ టీమ్‌కి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది.