జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా పంపించిన చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపిన సమయంలో పుట్టిన తమ పిల్లలకు.. చంద్రయాన్ అని పేరు పెట్టాలని ఒడిశాలోని కొందరు తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ విజయానికి గుర్తుగా.. తమ చిన్నారులకు ‘చంద్రయాన్’ అని నామకరణం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన సమయంలోనే.. తమ పిల్లలు జన్మించడంపై వారు ఆనందం వ్యకం చేస్తున్నారు.బుధవారం సాయంత్రం కేంద్రాపఢ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు చిన్చారులు జన్మించారు. వీరిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడ శిశువు ఉన్నారు. దుర్గా మండలంలోని తలచువా గ్రామానికి చెందిన జోష్నారాణి ఆడపిల్లకు జన్మనివ్వగా.. నీలకంఠాపుర్కు చెందిన బాల్, అంగులేయ్ గ్రామానికి చెందిన బేబీనా సేథి.. మగబిడ్డలకు జన్మనిచ్చారు.
వీరంతా తమ పిల్లలకు చంద్రయాన్ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.చంద్రయాన్-3 ల్యాండర్.. చంద్రుడిపై విజయంవంతగా కాలుమోపిన కొద్ది నిమిషాలకే తనకు మగబిడ్డ జన్మించడం రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని ఓ చిన్నారి తండ్రి పర్వత్ మల్లిక్ తెలిపాడు. ఆరిపాడు ప్రాంతానికి అతడు.. ఈ సంతోష సమయంలో తన బిడ్డకు ‘చంద్రయాన్’ అనే పేరును పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. పెద్దలు తన బిడ్డకు ‘చంద్రయాన్’ అని పెట్టమని సూచించారని మల్లిక్ భార్య రాణు తెలిపింది.”నా బిడ్డ పేరు ‘చంద్ర’ లేదంటే ‘లూనా’ పెట్టాలనుకుంటున్నాం. చంద్రయాన్ అంటే చంద్రుని వాహనమని అర్థం. చంద్రయాన్ అనేది స్ట్రైలిష్ పేరు కూడా. దీనిపై 21వ రోజున తుది నిర్ణయం తీసుకుంటాం.” అని రాణు తెలిపింది.
చంద్రయాన్-3 విజయవంతమైన అనంతరం ఈ ఆస్పత్రిలో పుట్టిన చిన్నారులందరికి.. అదే పేరు పెట్టాలని వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు ఆసుపత్రి నర్సు. కోస్తా జిల్లాలో గతంలో తుపానులు సంభవించినప్పుడు ఆ సమయంలో పుట్టిన పిల్లలకూ.. తమ తల్లిదండ్రులు వాటి పేర్లే పెట్టుకున్నారని ఆమె గుర్తుచేశారు. భారత్ చరిత్రాత్మక విజయం సాధించిన వేళ తమ పిల్లలు పుట్టినందుకు తల్లిదండ్రులు గర్వపడుతున్నట్లు ఆసుపత్రి అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి కె ప్రహరాజ్ తెలిపారు.