నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ దేశ ప్రధాని కాలేకపోవడానికి కారణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాల మూలంగానే శరద్ పవార్ ప్రధాని కాలేక పోయారని అన్నారు. ప్రధానమంత్రి కావడానికి యోగ్యత ఉన్నా.. అనుభవం, అర్హత ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల మూలంగా ఆయన దేశ ప్రధాని కాలేకపోయారని అన్నారు. శరద్ పవారే కాదు.. రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రధాని కాలేకపోవడానికి కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలే కారణమని అన్నారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగానే పవార్‌కు ప్రధాని అవకాశం చేజారిపోయిందని అన్నారు. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ ఎన్సీపీని వీడి మహారాష్ట్ర కేబినెట్‌లో చేరిన తరువాత కొద్ది రోజుల అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీయే కూటమిలోని మహారాష్ట్ర ఎంపీలతో మంగళవారం ప్రధాని మోడీ సమావేశమయ్యారు.
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్న నాయకులు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని మోడీ మండిపడ్డారు. పేరున్న గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని విమర్శించారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ అధిష్టానం ప్రతిభ కలిగిన అనేక మందిని ప్రోత్సహించలేదని మోడీ విమర్శించారు. ఉద్ధవ్ నేృతృత్వంలోని శివసేనపై విరుచుకుపడ్డారు. వారు ఏ కారణం లేకుండా వివాదాలు సృష్టించారని, అయినా సహించామని తెలిపారు. వారు ఓ వైపు అధికారంలో ఉంటూనే.. మరోవైపు విమర్శించాలనుకున్నారని.. ఒకేసారి ఈ రెండూ కలిసి ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తాను పదవిలో ఉన్నప్పటికీ, తప్పు చేసినవారికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో అధికారంలో ఉండి తప్పు చేసిన వారిని బాధ్యతలను, పదవులను తొలగించామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లను నిరాకరించామని చెప్పారు. ఎన్డీయే కూటమిలో తమకు మిత్రపక్షాలే ముఖ్యమని.. అందరూ కలిసి మెలిసి జీవిస్తారని, గౌరవం లభిస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.