రాజ్యాలు రాళ్ళలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపూరప చారిత్రక కట్టడాలే. అందులో ఆధ్యాత్నిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకున్న దేవాలయాల్లో ఎన్నో అంతుపట్టని రహస్యాలు. శాస్త్ర, సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా ఆ రహస్యాల ఛేదన కొనసాగుతూనే ఉంది కానీ, ఒక కొలిక్కిరావడం లేదు. వాటిలో ఒక్కటి విజయనగర సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగిన హంపి నగరంలోని విరూపాక్ష దేవాలయం. ఈ కోవెలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చదివేయండి.
ఇక్కడ కొలువై ఉన్న విరూపాక్ష స్వామి విజయనగర రాజుల కులదైవం. పురాణాల ప్రకారం ఈ పంపా నదీ తీరంలోనే పార్వతీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసిందని చెబుతారు. చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయసళులు పరిపాలనలో మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజుల కాలంలో నిర్మించారని అంటారు.
విరూపాక్షస్వామి ముందున్న మండపం గోడ మీద రాజగోపురం నీడ ఎప్పుడూ తలకిందులుగా పడడం ఇక్కడి ప్రత్యేకత. ఇందుకు గల కారణం మాత్రం ఇప్పటివరకూ ఏ శాస్త్రవేత్త కూడా కనుగొనలేకపోయారు. ఇక్కడ మరో అద్భుతం ప్రధాన దేవాలయం లోపాల 6 అడుగుల ఎత్తులో చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం గుండా ఎల్లప్పుడూ దేవాలయం గోడ మీద సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. అవి వివిధ రంగుల్లో ఉండటం గమనార్హం. ఆ నీడకు అడ్డంగా మన చేతి వేళ్ళను పెట్టినా ఆ నీడ కనబడకపోవడం మరొక్క రహస్యం. ఇటువంటి నిర్మాణం ఆ నాటి శిల్ప, వాస్తు శైలికి నిదర్శనమని చెబుతారు.
ఇప్పటితరం శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినా కనుక్కోలేకపోతున్నారు. అదే విధంగా ఉగాది రోజున ఇక్కడ సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగం మీద పడటం ఒక అద్భుతమనే చెప్పాలి. అదే విధంగా గర్భ గుడిలో పడే సూర్యకిరణాలు సాలె మండపం వద్ద తిరిగి తలకిందులుగా కనిపిస్తాయి. ఈ కిరణాలూ ఉదయం, సాయంత్రం మాత్రమే కనిపిస్తాయి.
ఇక్కడ మరో రెండు ఉపాలయాలు అత్యంత ప్రాచీనమైనవని చెబుతారు. అందులో ఒక్కటి ఏడో శతాబ్దానికి చెందిన పాతాళేశ్వర స్వామి దేవాలయం. మరొక్క ఆలయం విఠలాలయం. ఈ కోవెలలో ప్రధాన దైవం శ్రీ మహా విష్ణువు. ఈ దేవాలయం గోపురం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయాన్నీ 15వ శతాబ్దంలో నిర్మించారని అక్కడి శిలాఫలకాల ఆధారంగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇక్కడి ప్రధాన ఆకర్షణ మ్యూజికల్ పిల్లర్స్. ఇక్కడ స్తంభాలను మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. ఈ విషయంపై బ్రిటిష్ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసారు. కానీ దీని వెనుక ఉన్న రహస్యం మాత్రం ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారు.