భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలోని 64వ యోగిని దేవాలయం. ఈ అద్భుతమైన ఆలయం సుమారు 1000 అడుగుల ఎత్తుగల కొండపై వృత్తాకారంలో నిర్మించబడింది. తాబేలు రాజు దేవ్‌పాల్ 1323లో నిర్మించిన ఈ ఆలయ విశేషాలు..
మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలో ఉన్న 64 యోగిని దేవాలయం.. గుండ్రని ఆకారంలో, 64 గదులతో ఉంటుంది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిని దేవత విగ్రహం ఉంటాయి. అందువల్లే ఈ దేవాలయానికి 64 యోగిని దేవాలయం అనే పేరు వచ్చింది.
ఈ యోగినీ రూపాలు అద్భుతంగా మలచబడ్డాయి. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ ఆలయంపై దాడులు నిర్వహించి, ఈ శిల్పాలను ధ్వంసం చేశారు. అందువల్ల వీటిల్లో కొన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు.
ఈ ఆలయంలో జ్యోతిష్యం, గణితం బోధించేవారట. మంత్ర తంత్రాలు నేర్చుకునేందుకు సాధువులు, ఋషులు ఇక్కడికి వచ్చేవారట. ఈ ఆలయంలోని యోగినీలను తాంత్రికులు, మంత్రసాధకులు పూజించేవారు. ఈ దేవాలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడివుందని అక్కడి స్థానికుల నమ్మకం.
అందుకే రాత్రి వేళలో ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కాళీమాత 64వ అవతారమే యోగిని అని, ఘోర అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఈ అవతారాన్ని ధరించిందనే నమ్మకం ప్రచారంలో ఉంది.
అపూర్వమైన ఇక్కడి నిర్మాణాలు సందర్శకులను అబ్బురపరుస్తుంటాయి. ఇక ఇక్కడి ప్రధాన విశేషం ఏమిటంటే.. గర్భాలయంలోని శివపార్వతుల నంది వాహనాన్ని అధిరోహించి కనిపిస్తుంటారు.
బ్రిటీష్ ఆర్కిటెక్చర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగా భారత పార్లమెంటు భవనాన్ని నిర్మించాడని చెబుతారు. భారత పార్లమెంటు భవనం ఈ దేవాలయంలా ఉంటుంది. పార్లమెంట్ స్తంభాలు కూడా ఆలయ స్తంభాల మాదిరిగానే కనిపిస్తాయి.