అజంతా ఎల్లోరా సమీపంలోని కైలాస ఆలయం నిర్మాణాన్ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్య పోవాల్సిందే! కొండలని తొలచి శిల్పాలు మార్చిన గొప్ప నైపుణ్యం మన భారతీయ శిల్పులది. దానికి ప్రతీకే ఈ ఎల్లోరాలోని కైలాశనాథ ఆలయం. ఒకే రాతితో.. ఆలయ నిర్మాణమంతా జరిగింది. చుట్టూ ఉన్న ఆలయాలు, డిజైన్స్ అన్నీ ఒక రాతితోనే నిర్మించిన గొప్ప శిల్పశైలి ఈ ఆలయ ప్రత్యేకత.
ఈ ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. వాటిలో ఒకటి మన భారత్ దేశంలోని కైలాశ ఆలయం. ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు పుట్టినిల్లు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లోని ఈ ఆలయాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచానికే తలమానికమైన అద్భుత నిర్మాణం కైలాస ఆలయ రహస్యాలను తెలుసుకుందాం.
ఆలయ నిర్మాణమే రహస్యం:
ఈ కైలాస దేవాలయాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్తిగా ఒక కొండను తొలచి నిర్మించిన ఆలయమే కైలాస ఆలయం. ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం 4లక్షల టన్నుల రాతిని తొలిచి కేవలం 18 ఏళ్లలో గుహను గుడిగా మలిచారు. 4లక్షల టన్నులంటే ఏడాదికి 22,22టన్నుల రాయి.. అంటే రోజులో 12 గంటలు పనిచేసినా.. 60 టన్నుల రాయిని.. గంటలో 5 టన్నుల రాయిని తొలిగించాలి.. అదీ ఎలాబడితే అలా కాదు.. ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ.. రాయిని తొలగించాలి.. మరి ఇంతటి గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో.. అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో ఇప్పటికి అంతు చిక్కని రహస్యమే. ఈ ఆలయం క్రీ.శ.783లో పూర్తి చేసినట్లు అక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది.
అద్భుతం ‘కింద’.. మరో అద్భుతం:
ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీ అనుకుంటే..దీని ‘కింద’ మరో మిస్టరీ దాగి ఉంది. అదే ‘అండర్ గ్రౌండ్’ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే.. ఆలయంలో చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. అలాగే, ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి. గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి. దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది. ఈ చిన్నని గుహల నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. ఈ నేపథ్యంలో వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అదే కాదు ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికి మిస్టరీనే.