బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ డియో అర్థాంతరంగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు బెంచ్ కోర్టు హాలులోనే వెల్లడించారు. ఆత్మగౌరవం విషయంలో రాజీపడలేనని చెప్పి రాజీనామా ప్రకటించారు. అప్పటి వరకు వేర్వేరు కేసుల్లో వాదనలు విన్న న్యాయమూర్తి రోహిత్ డియో.. అంతలోనే రాజీనామా ప్రకటించడం కోర్టు హాలులోని వారందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాకుండా న్యాయమూర్తి రాజీనామా చేసే సమయంలో.. కోర్టు హాలులోనే కోర్టులో ఉన్న అందరికీ క్షమాపణలు చెప్పినట్లు ఓ న్యాయవాది తెలిపారు. ఎన్నోసార్లు మీపై నేను ఆగ్రహం వ్యక్తం చేశానని, మిమ్మల్ని బాధపెట్టాలని అలా చేయలేదని, మీ నైపుణ్యత పెరగాలని మాత్రమే అలా అన్నానని, మీరు నా కుటుంబ సభ్యుల వంటి వారని, మీకు ఓ విషయం చెబుతున్నందుకు క్షమాపణలు అడుగుతున్నానని.. నేను నా రాజీనామా ఇచ్చేశాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా పని చేయలేనని, అందరూ కష్టపడి పని చేయాలని సూచించినట్లు న్యాయవాది చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే క్రమంలో.. తాను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు జస్టిస్ రోహిత్ డియో తెలిపారు.
ఆయన న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో జస్టిస్ రోహిత్.. కీలక తీర్పులు ఇచ్చారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో గత ఏడాది ప్రొఫెసర్ సాయిబాబాను జస్టిస్ రోహిత్ నిర్దోషిగా ప్రకటించారు. జీవిత ఖైదును కొట్టివేస్తూ ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు, నాగపూర్ – ముంబై సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేకు సంబంధించి ఈ సంవత్సరం ప్రారంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై గతవారం స్టే విధించారు. ఆయన పదవీ కాలం 2025 డిసెంబర్ వరకు ఉండగా, రెండేళ్లకు ముందే రాజీనామా చేశారు. ఇంతకుముందు 2016లో మహారాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ గా జస్టిస్ రోహిత్ డియో సేవలందించారు.