హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్(98)(MS Swaminathan) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు.. చెన్నైలోని తన నివాసంలో గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు.. స్వామినాథన్ (Swaminathan)ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలను ఆయన సృష్టించారు. ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. స్వామినాథన్‌తో(Swaminathan) దిగిన ఫొటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసి సంతాపం తెలిపారు. “డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మన దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు.. వ్యవసాయంలో ఆయన చేసిన సంచలనాత్మక కృషి లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. దేశానికి ఆహార భద్రతను కల్పించింది” అని ఆయన సేవలను మోదీ కొనియాడారు.
తన తండ్రికి గతకొద్దిరోజులాగా ఆరోగ్యం బాగాలేదని.. గురువారం ఉదయం కన్నుమూశారని WHO మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్య తెలిపారు. “నాన్న.. చివరి క్షణం వరకు రైతుల సంక్షేమం కోసం, సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. మా తల్లిదండ్రుల వారసత్వాన్ని మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం కొనసాగిస్తాం. వ్యవసాయంలో మహిళలు నిర్లక్ష్యానికి గురవుతున్నారని గుర్తించిన అతికొద్ది మందిలో మా నాన్న ఒకరు. మహిళా సాధికారత కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు” అని తెలిపారు.
స్వామినాథన్ 1925 ఆగస్టు7న తమిళనాడులోని కుంభకోణంలో(scandal) జన్మించారు. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో చదివారు. తరువాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్ 1943 నాటి భయంకరమైన బంగాల్ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలిని నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు.
1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో నుంచి సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో.. బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానమ్ విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో ఆయన విజయం సాధించారు. 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి పీహెచ్డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి.. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు చేపట్టారు.