కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తాజాగా రాజకీయ పరిణామాలు మారుతున్న్నాయి. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్, మంత్రి వేణు మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయ భవిష్యత్‌పై సరిగ్గా నెలరోజుల కిందట స్పష్టమైన ప్రకటన చేసిన ఎంపీ సుభాష్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వేణుకు మళ్లీ అవకాశమిస్తే.. తాను లేదా తన కుమారుడు బరిలో నిలుస్తామని చెప్పిన సుభాష్.. ఇవాళ తన కుమారుడితో ప్రమాణం చేయించి.. రాజకీయ రంగ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించారు. రాజకీయ వారసుడిగా తనయుడు పిల్లి సూర్య ప్రకాశ్‌ను ఆశీర్వదించాలని శ్రేణులు, అభిమానులను ఆయన కోరారు.
కార్యకర్తలతో ముఖాముఖి.. రాజకీయ వారసుడిగా తన కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్‌ను ఆశీర్వదించాలని ఎంపీ పిల్లి సుభాష్ కార్యకర్తలను కోరారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ముఖ్య కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసి పలు అంశాలను చర్చించారు. తనయుని రాజకీయ అరంగేట్రాన్ని ప్రమాణం చేయించి అధికారికంగా ప్రకటించడం విశేషం. నీతి, నిజాయితీ మీదనే రాజకీయాలు చేసుకుంటూ రావాలని కార్యకర్తల సమక్షంలో తనయునికి సూచన చేశారు. తన రాజకీయ జీవితంలో రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా నిలిచిందని అన్నారు. రాజకీయ ప్రవేశంతో నియోజకవర్గ ప్రజలకు ఇంకా మంచి చేసే భాగ్యం కల్పించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ముఖ్య నాయకులు తరలివచ్చారు. సూర్యప్రకాశ్ నాయకత్వాన్ని బలపరుస్తూ వారంతా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సీఎంతో సమావేశం… మంత్రి వేణుకి మరోసారి రామచంద్రాపురం టికెట్ ఇస్తే… తాను లేదా తన కుమారుడు అతడిపై పోటీ చేస్తామని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గత నెలలో తేల్చిచెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను మంత్రి వేణు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వేణుతో కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని తెలిపిన చంద్రబోస్.. ఆ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. క్యారెక్టర్ లేని వ్యక్తితో కూర్చోనని తేల్చి చెప్పానని ఎంపీ వెల్లడించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో విభేదాల నేపథ్యంలో సీఎం జగన్.. పిల్లి సుభాష్‌ను తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. పలు కీలక అంశాలపై ప్రశ్నలు సంధించగా.. మంత్రి వేణు అక్రమాలపై సుభాష్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ముందుగా సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డిని కలిసిన బోస్.. ఆ తర్వాత సీఎం జగన్‌తో అరగంటపాటు సమావేశం అయ్యారు.