తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో దారుణం జరిగింది. శివారులోని మామిడితోట వద్ద నీటికుంటలో పడిన కూతురును కాపాడే క్రమంలో తల్లీకూతురు మృతి చెందారు. జడ్చర్ల ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన సుజాత (25), కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన శ్యాంరావు దంపతులకు నర్సమ్మ(2) అనే కూతురు ఉన్నది. గొల్లపల్లి శివారులోని శంకరయ్యతోటలో సుజాత కూలీపనులు చేస్తుండేది. మామిడితోటలో స్టోరేజ్ కోసం తవ్విన నీటికుంట వద్ద బట్టలు ఉతికేందుకు బుధవారం సుజాత, కూతురు నర్సమ్మతో కలిసి వెళ్లింది. నర్సమ్మ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటికుంటలో పడగా, గమనించిన సుజాత.. పాపను కాపాడే క్రమంలో కాలుజారి తానూ కుంటలో పడిపోయింది. ఊపిరి ఆడక తల్లీకూతురు నీటికుంటలోనే మృతి చెందారు.
ఈ విషయాన్ని గమనించిన తోటికూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్ ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జడ్చర్ల దవాఖానకు తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని వెంకంబావి తండా గ్రామానికి చెందిన రమావత్ శ్రీను అడవిలోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎప్పటిలాగే మంగళవారం కూడా పని నిమిత్తం అడవిలోకి వెళ్లిన శ్రీనుపై ప్రమాదవశాత్తు బండరాయి (ఏనె గుండు) పడింది. దాంతో శ్రీను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అడవికి వెళ్లిన శ్రీను ఇంటికి తిరిగి రాకపోవడంతో వెంకంబావి తండా వాసులు మంగళవారం సాయంత్రం నుంచి అడవంతా గాలించారు. ఈ క్రమంలో బుధవారం (ఇవాళ) ఉదయం 7.00 గంటలకు ఊడుగట్టు గుట్టలో ఓ బండరాయి కింద శ్రీను మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.