భారత దేశ భౌగోళిక స్వరూపం వైవిధ్యభరితమైంది. ఉత్తరాన మంచు కొండలతో ఉన్న హిమాలయాలు, పశ్చిమాన ఇసుగ దిబ్బలు, తూర్పున మైమరిపించే కొండలు, భూములు, దక్షిణాన 7,500 కిలోమీటర్లకు పైగా ఉన్న సముద్ర తీరం. మనం అనుకుంటాం కానీ.. మన దేశంలో మనం తప్పకుండా చూడాల్సిన అందమైన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక్కటి ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటి, సాహసభరిత అనుభవాలను పంచే పర్యాటక గమ్యస్థానం లడఖ్. ఇది ఒక ఉత్కంఠభరితమైన సెలవు విడిది. లడఖ్‌లోని అనిర్వచనీయమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. లేహ్ నుంచి లడఖ్ వెళ్లే ప్రయాణం ఎంతో సాహసభరితంగాను, ఆహ్లదంగాను ఉంటుంది. అంతేగాక సువాసన వెదజల్లే హిమాలయన్ వంటకాల రుచులు ఈ టూర్‌లో ఆస్వాదించవచ్చు.
సింధు నదీ తీరాన ఉన్న లడఖ్, జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దీని ప్రధాన నగరమైన లెహ్ మాత్రమే కాకుండా, ఇక్కడికి సమీపంలో అల్చి, నుబ్రా లోయ, హేమిస్, జంస్కర్ లోయ, కార్గిల్, పంగోంగ్ మొరిరి లాంటి ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందమైన సరస్సులు, బౌద్ధారామాలు, మంత్రం ముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, పర్వత శిఖరాలు, ఈ ప్రదేశం యొక్క కొన్ని ఆకర్షణీయమైన అంశాలు. ఈ రాష్ట్రంలోని సాధారణంగా మాట్లాడే భాషలు లడఖి, పురిగ్, టిబెటన్, హిందీ, ఇంగ్లీష్. ప్రపంచంలోనే రెండు ప్రముఖ పర్వత శ్రేణులైన కారకోరం, హిమాలయాల నడుమ,సముద్ర మట్టానికి సుమారు 3500 మీటర్ల ఎత్తులో లడఖ్ కొలువుదీరింది. అదనంగా, సమాంతర శ్రేణులైన జంస్కర్, లడఖ్ పర్వత శ్రేణులు కూడా లడఖ్ లోయని చుట్టుముడుతున్నాయి. లడఖ్‌ను ‘మూన్ ల్యాండ్’ అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం జమ్మూ & కాశ్మీర్‌లోని భాగమైన లడఖ్, 10వ శతాబ్దంలో టిబెట్ రాజుల వారసులచే పాలించబడింది. బౌద్ధం ఇక్కడి ప్రబలమైన మతం కావటం వల్ల, లడఖ్ ఆకర్షణల జాబితాలో బౌద్దారామాలు ప్రధానంగా చోటు చేసుకుంటాయి. హేమిస్ ఆరామం, శంకర్ గొంప, మాతో ఆరామం,షే గొంప, స్పితుక్ ఆరామం, స్టంకా ఆరామం ఈ ప్రదేశంలోని కొన్ని ముఖ్యమైన ఆరామాలు. ఇవే కాకుండా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు లేహ్ విమానాశ్రయం నుంచి బైక్‌ని అద్దెకి తీసుకొని లడఖ్ వరకు సాహస యాత్ర చేస్తుంటారు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో అత్యంత ముఖ్యమైనవి మీకోసం..
లడఖ్‌లో సందర్శించడానికి అత్యంత ఆసక్తికరమైన స్థలాలలో సీమో గొంపా ఒకటి. ఒక చిన్న కొండ ఎక్కితే బంగారు వర్ణం కలిగిన బుద్ధుడు విగ్రహన్ని సందర్శించవచ్చు. ఇంకా నుబ్రా లోయ మంచుతో కప్పబడిన హిమాలయ శ్రేణులతో చుట్టుకుని ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా అందమైన ఇసుక దిబ్బలు, మఠాలు, శిథిలావస్థకు చేరిన రాజభవనం వంటి భిన్నమైన సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది.
స్టోక్ కాంగ్రీ- లడఖ్ ఇక ఇండియాలో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో స్టోక్ కాంగ్రీ శిఖరం రెండో ప్లేస్ లో ఉంటుంది. ఇది 6,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ట్రిక్కింగ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. 22 కిలోమీటర్ల పొడవైన డ్రాంగ్-డ్రంగ్-హిమానీనదం లడఖ్ ప్రాంతంలోని పర్యాటకులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద హిమానీనదం. లేహ్-జాన్స్కర్ లోయ నుంచి మూడు రోజుల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన హిమానీ నదాలు, అద్భుతమైన పర్వత శ్రేణులను, పండ్ల తోటలను పర్యటకులు సందర్శించవచ్చు.
మినీ స్విట్జర్లాండ్ అయిన ఖాజ్జియార్ భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీకి 26 కిలోమీటర్ల దూరంలో హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ అయిన ఖాజ్జియార్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన గుల్మార్గ్ అని కూడా పిలుస్తారు. విస్తారమైన ఆకుపచ్చని పచ్చిక బయళ్లు, దట్టమైన అడవులతో పాటు గంభీరమైన మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలతో అందంగా ఉంటుంది. మార్చి నుంచి అక్టోబర్ వరకు లడఖ్ ట్రిప్ కోసం అనువైన సమయం.