నేటి తరంలో మంచి క్రేజ్ ఉన్న రంగాల్లో మోడలింగ్ ఒకటి. టూత్‌పేస్ట్, సబ్బుల నుంచి ఇల్లు, కారు వరకు ప్రతిదీ జనంలోకి వెళ్లాలంటే పేరున్న మోడల్స్ ప్రచారం కావాల్సిందే. పదిమందిలో ప్రత్యేక గుర్తింపు, మంచి కెరియర్, వీలుంటే సినిమా అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. డిజిటల్ యుగంలో మోడలింగ్‌కున్న డిమాండ్ దృష్ట్యా దీన్ని కెరీర్‌గా ఎంచుకొని, కష్టించి పనిచేస్తే మంచి అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. కాస్త అనుభవం వచ్చాక.. సొంతంగా మోడలింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు.
మంచి శరీర సౌష్టవం, ఆకట్టుకొనే రూపం, సొంత స్టైల్ ఉంటే చాలు.. ఎవరైనా ఈ రంగంలో రాణించొచ్చు. ఎత్తు ఐదు అడుగులు ఉన్నా పర్వాలేదు. ఆత్మవిశ్వాసం, మంచి హావభావాలుంటే మేనేజ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్, పబ్లిక్ రిలేషన్స్ పెంచుకునే చొరవ ఉంటే చాలు. ఆడ, మగ అనే తేడా కూడా లేదు. మేకప్, కాస్ట్యూమ్స్, కెమెరా, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై అప్‌డేటెడ్‌గా ఉండాలి. పగలు, రాత్రి.. ఏ టైంలోనైనా పనిచేయగలగాలి.
ఈ రంగంలో ప్రవేశానికి ప్రత్యేకంగా విద్యార్హతలు లేకున్నా.. కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండటం మంచిది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) వంటి సంస్థల్లో చదివితే మరింతగా రాణించే అవకాశాలుంటాయి. తగిన అర్హతలుండి మోడల్‌గా ట్రై చేయాలనుకుంటే మోడలింగ్ ఏజెన్సీ సాయంతో ప్రొఫెషనల్ సీవీ రెడీ చేసుకోవాలి. దానిని మంచి మోడలింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్ సంస్థలకు పంపించాలి. ఫ్యాషన్ వీక్ ఆడిషన్లు, ర్యాంప్ షోలలో పాల్గొన్న అనుభవం ఉంటే వాటి వివరాలూ మెన్షన్ చేయొచ్చు.