తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన్‌పూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ నిరాకరించి.. అభ్యర్ధిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. సోమవారం హైదరాబాద్లో ఉన్న రాజయ్య నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
కార్యకర్తలందరు దుఃఖంతో తమదగ్గరకు రాగానే ఇది చూసి రాజయ్య తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. తమ నేత భావోద్వేగాన్ని చూసి ఆయన అనుచరులు సైతం పలువురు కంట తడిపెట్టారు. ఇప్పుడున్న స్థాయికి తగ్గకుండా తనకు మంచి అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని రాజయ్య తెలిపారు. అధినాయకుడు మాటే శిరోధార్యమని.. కేసీఆర్ నాయకత్వంలో సైనికుల్లాగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా కొన్ని పనులున్నాయని అవి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 16న జరిగే సింహగర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో ఉండడమే తనకిష్టమంటూ రాజయ్య బోరున ఏడ్చేశారు.
తెలంగాణలో అధికార భారత్ రాష్ట్ర సమితి (భారాస) శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను భారాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించారు.పంచమి తిథి కావడంతో ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేస్తున్నట్లు తెలిపారు.
నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ స్థానాలకు భారాస అభ్యర్థులను ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఉప్పల్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులను మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు.