ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, ఇదే సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఆమెకు వోఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్న ఆమె.. కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది.. ఓవైపు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెబుతున్నా.. మరోవైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీరిక లేకుండా గడుపుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ నుంచి కొందరు వెనుకబడిన ప్రజాప్రతినిధులు తప్పితే.. మిగతా వాళ్లంతా.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు, గడపగపకు మన ప్రభుత్వం, ఇతర ఫంక్షన్లు ఇలా తీరిక లేకుండా గడిపేస్తున్నారు.. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బోధన ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ ఏజెన్సీల పనితీరు మెరుగుపడాలని మంత్రి విడదల రజని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలకు చికిత్స అందించేందుకు అన్ని ఆస్పత్రుల్లో పదేసి పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బోధన ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలపై మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ‘కొత్త వైద్య కళాశాలల్లో అన్ని వసతులు ఈ నెలాఖరు లోగా సమకూర్చాలి. వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభమవుతున్నందున విద్యార్థులకు చిన్న సమస్య కూడా రాకూడదు. బోధన ఆస్పత్రులపై పర్యవేక్షణ మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న సేవల్లో నాణ్యతపై పర్యవేక్షణకు కొత్తగా జేడీల నియామకానికి నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు.