రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో ములాఖత్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా(Minister RK Roja) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటించటాన్ని రేణూ దేశాయ్ వ్యాఖ్యలతో రోజా పోల్చారు. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని గతంలో అన్న రేణు దేశాయ్ వ్యాఖ్యలతో ఈ పొత్తు వ్యాఖ్యలను పోల్చారు. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలవటం సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది లాంటిదేనని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు సంగతి బీజేపీకి తెలుసునని.. బీజేపీతో చర్చించకుండా టీడీపీతో పొత్తు అని పవన్ కళ్యాణ్ ప్రకటించటం పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమేనని రోజా వ్యాఖ్యానించారు. 2018లోనే స్కిల్ కుంభకోణం(Skill Scam) బయటపడిందని ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే సీబీఐ, ఈడీ విచారణ చేయమని లేఖ రాయాలన్నారు. ఢిల్లీ వెళుతున్న లోకేష్ అక్కడే ఉన్న ఈడీ, సీబీఐ ఆఫీసుకు వెళ్ళి ఈ కుంభకోణాలపై విచారణ చేయాలని లేఖ ఇవ్వాలని ఆమె సూచించారు.
ఎకరం భూమి నుంచి వేల కోట్లు చంద్రబాబుకు ఎక్కడ నుంచి వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉండటం వల్లే ఇన్నేళ్ళు తప్పించుకుని తిరిగాడని ఆమె అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు స్కాంలను ప్రజలకు వివరిస్తామన్నారు. అరెస్టు దెబ్బతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ భాష మారిందని మంత్రి రోజా వెల్లడించారు.