టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా ఎమోషనల్ అయ్యారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ.. ‘టీడీపీలో నచ్చక బయటకొస్తే నన్ను టార్చర్ చేస్తున్నారు. లోకేష్ నీ తల్లి గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా?, నీకు ఫ్యామిలీ లేదా.. నీ ఫ్యామిలీని అంటే ఊరుకుంటావా?, దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు. మాజీ మంత్రి బండారు నన్ను నీచంగా, హేయంగా మాట్లాడారు. ఆయన చేసిన వాఖ్యలు పట్ల రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు’ అని అన్నారు.
‘టీడీపీలో ఉన్న మహిళలు బండారు వ్యాఖ్యలు స్వాగతిస్తున్నారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులను ఎవరూ ఇలా మాట్లాడితే ఊరుకుంటారా?, మాట్లాడితే సినిమా వాళ్లు అంటారు. టీడీపీ పెట్టిందే ఎన్టీఆర్ సినిమా ఆయన కాదా.. సినిమా వాళ్లు అంటే లోకువా? మంత్రి బండారు భార్యను అడుగుతున్నా.. ఆరోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాదు. మాజీ మంత్రులు గంటా, అయ్యన్న చివరకు లోకేష్ ఎందుకు స్పందించలేదు. మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఊరుకుంటారా? మీ ఇంట్లో ఉన్న వారే ఆడ వాళ్లా… వైసీపీలో ఉన్న మహిళలు ఆడవాళ్లు కాదా? మహిళలు అందరూ ఆలోచన చేయండి.. లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు సపోర్ట్ చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను పదేళ్లు టీడీపీలో పనిచేశా. మహిళ సాధికారతకు పాటుపడుతున్నాను. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా. నేను రాజకీయంగా మంత్రిగా ఎదిగితే.. చూసి ఓర్వలేక వాఖ్యలు చేస్తున్నారు. జయసుధ, జయప్రద, దివ్య వాణి, శారదా నేను సినిమా రంగం నుంచి టీడీపీలో పనిచేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎందుకు ప్రచారానికి పిలిచారు? ఎన్టీఆర్‌కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. నేను సినిమాలో నటించే సమయంలో బ్రాహ్మణి చిన్న పిల్ల. లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ బ్రాహ్మణి చదువుతోంది. మా నాయకుడు జగన్‌ను అంటే మేము ఊరుకోవాలా?’ అంటూ ప్రశ్నించారు.