మద్యం మత్తులో ఓ యువకుడు దుశ్శాసనడులా ప్రవర్తించాడు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, నడిరోడ్డుపై ఆమె దుస్తులను తీసేశాడు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ పీఎస్ పరిధి బాలాజీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఆందోళన కలిగిస్తుందని తెలిపింది.
ఈ ఘటనపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. బాధిత మహిళకు అండగా ఉంటామని తెలిపారు. అంతేకాకుండా.. బాధిత మహిళకు మున్సిపల్ కార్పోరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. యువతికి పెళ్లి చేసేందుకు మంత్రి మల్లారెడ్డి ముందుకు వచ్చారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి మల్లారెడ్డి ఆదేశం ఇచ్చారు. భవిష్యత్ లో యువతి యోగక్షేమాలు కూడా తానే చూసుకుంటామని కుటుంబ సభ్యులకు మంత్రి మల్లారెడ్డి అభయం ఇచ్చారు.
ఈనెల 5 న రాత్రి 10గంటల ప్రాంతంలో షాపింగ్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో బస్ స్టాప్ లో నిలుచున్న బాధితురాలి పట్ల మారయ్య అనే నిందితుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను వివస్త్రను చేసి వేధించాడు. పక్కనే ఉన్న మహిళ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. డయల్ 100కి ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసులో నిందితుడు మారయ్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడు చేసిన పనికి సహకరించిన తల్లి నాగమ్మను సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మహిళల పట్ల జరిగే అన్యాయాలు రోజు రోజుకి పెరుగిపోతున్నాయి అని మహిళలకు భద్రతను కలిపించాలని కోరుతున్నారు.