కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)కి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి, త్వరలోనే కాంగ్రెస్‌లో(Congress) చేరనున్నారు. మైనంపల్లి రాజీనామాతో పలువురు అభ్యర్థులను పరిశీలన చేసిన పార్టీ అధినేత కేసీఆర్(KCR).. మర్రి రాజశేఖర్‌రెడ్డికి స్పష్టమైన సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. మర్రి రాజశేఖర్‌రెడ్డి (Marri Rajasekhar Reddy)మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆ నియోజక వర్గంలో పరిస్థితులపై అవగాహన ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ఉద్ధేశంతో ఆ అభ్యర్థికి టికెట్ ఇచ్చేందుకు సుముఖత చూపిందని పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు రాజశేఖర్‌రెడ్డికి ఎన్నికల్లో ఉపయోగపడతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.
అధిష్ఠానం సూచనతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్‌రెడ్డి.. నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తన మామ మంత్రి మల్లారెడ్డితో కలిసి వచ్చిన ఆయనకు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. డబ్బు కట్టలతో వస్తున్న కాంగ్రెస్ నేతల(Congress Leaders)ను నమ్మి మోసపోవద్దని మల్లారెడ్డి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు సిన్మా చూపిస్తామని ఈ మామాఅల్లుళ్లు సవాల్ విసిరారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ ప్రభుత్వం 115 అభ్యర్థులను ఆగస్టులో ప్రకటించిన విషయం తెలసిందే. అనంతరంలో మిగిలిన మరో నాలుగు స్థానాలకి సంబంధించిన నలుగురు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. సదురు నాయకులకి అధిష్ఠానం సమాచారం ఇవ్వడంతో ప్రచార ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే నెల మొదటి వారంలో తొలి విడత అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపింది. బీజేపీ తమ అభ్యర్దులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉంది.
“కాంగ్రెస్ నాయకులకు ఈ మామా అల్లుళ్ల సిన్మా చూపిస్తాం. ఈ రోజు ఈ ర్యాలీ ఇంత మంది వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కార్యకర్తలు అందరూ మరో 70 రోజులు కష్టపడాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చెయ్యాలి. కాంగ్రెస్ నాయకులు అంటేనే మోసగాళ్లు. బీఆర్ఎస్ 2000 ఇస్తానంటే.. వాళ్లు 4000 ఇస్తానని అంటున్నారు. అలాంటి మాటలు నమ్మకండి. సీఎం కేసీఆర్ కూడా నవంబర్ 16న వరాలు కురిపిస్తారు. మీ అందరికి బీసీ బంధు ఇస్తాం, దళిత బంధు ఇస్తాం. గృహలక్ష్మి పథకాన్ని రేపటి నుంచి ఇస్తాం.”- మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి