లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Reservation Bill)పై చర్చ జరుగుతున్న వేళ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలో తన సీటు పోతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్(International TechPark)ను ప్రారంభించిన మంత్రి.. ఈ మేరకు మహిళా బిల్లుపై స్పందించారు.మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
మన జీవితాలు చాలా చిన్నవని.. అందులో తన పాత్ర తాను పోషించినట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలులో తన సీటు పోయినా.. వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అంతకు ముందు టెక్‌పార్క్‌ను ప్రారంభించిన తర్వాత విదేశీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం ఎన్నో సమస్యలను మేము లేవనెత్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై అందరు కలిసి నిలబడాలని ఆయన ఎక్స్(Twitter) వేదికగా కోరారు. మంగళవారం పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినందుకు భారతీయ పౌరుడిగా గర్విస్తున్నానని ఆయన తెలియజేశారు.
“మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నాను. మహిళా నేతలు చాలామంది రావాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్లలో నా సీటు పోతే పోనివ్వండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మన జీవితాలు చాలా చిన్నవి.. నా పాత్ర నేను పోషించాను.” – ఐటీ మంత్రి కేటీఆర్